ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల అభివృద్ధి కోసం నాడు- నేడు కింద అనేక చర్యలు చేపడుతున్న ప్రభుత్వం.. తాజాగా బడుల్లో భద్రత కోసం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలు సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలకు అడ్డాగా మారకుండా ఉండటం సహా స్కూల్ ఆవరణలోని పరికరాల భద్రత కోసం నైట్ వాచ్‌మెన్లను నియమించాలని నిర్ణయించింది. ఇందుకోసం అనుసరించాల్సిన విధివిధానాలపై ఏపీ పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీచేసింది.
ప్రస్తుతానికి 5 వేల 388 నాన్ రెసిడెన్షియల్ హైస్కూళ్లలో నైట్ వాచ్‌మెన్‌లను నియమించనున్నారు. వీరికి నెలకు ఆరువేల గౌరవ వేతనం ఇస్తారు. పాఠశాఖ విద్యాశాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం నైట్ వాచ్‌మెన్.. సాయంత్రం స్కూలు మూసివేసే సమయానికల్లా పాఠశాలకు చేరుకోవాలి. మరుసటి రోజు స్కూల్ తెరిచేవరకూ విధులు నిర్వర్తించాలి. సదరు స్కూల్ హెడ్‌మాస్టర్ పర్యవేక్షణలో నైట్ వాచ్‌మెన్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
అలాగే రాత్రిపూట విధులు నిర్వహించే సమయంలో స్కూలు బిల్డింగ్, పరిసరాలు, పరికరాలను ఓ కంట గమనిస్తూ ఉండాలి. రాత్రివేళ పాఠశాల ప్రాంగణంలోకి ఇతర వ్యక్తులు ఎవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా ప్రమాదం ఎదురైతే స్కూల్ హెడ్మాస్టర్‌తో పాటుగా పోలీసులకు నైట్ వాచ్‌మెన్ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటుగా గార్డెనింగ్, మంచి నీటి నిర్వహణ వంటి విషయాల్లోనూ నైట్ వాచ్‌మెన్ పనిచేయాల్సి ఉంటుంది. మరోవైపు పేరెంట్ కమిటీల ద్వారా నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలన్న పాఠశాల విద్యాశాఖ.. 60 ఏళ్లలోపు వ్యక్తిని నైట్ వాచ్‍మెన్‌గా నియమించాలని స్పష్టం చేసింది. స్థానికులనే నియమించాలని సూచించింది. అలాగే ఎంపికైన వారికి టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ నుంచి నెలకు ఆరువేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని సూచించింది.