విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్లో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ హాస్పిటల్ రెండో అంతస్తు నుంచి భారీగా పొగలు రావడంతో హాస్పిటల్ ఆవరణలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో హాస్పిటల్లో రోగులు, సిబ్బంది భయపడి బయటకు పరుగులు తీశారు. మంటల్లో పలువురు రోగులు చిక్కుకున్నారు. దీంతో రోగులను అంబులెన్స్‌లలో వేరే ఆస్పత్రులకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హాస్పిటల్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ జరిగిందా? లేక బ్లాస్ట్ జరిగిందా? అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.