తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ కోరారు. వర్షాలకు దెబ్బదిన్న పంట పొలాలను పరిశీలించేందుకు కంకిపాడు వచ్చిన కేంద్ర బృందాన్ని బుధవారం మాజీ మంత్రి దేవినేని ఉమ, మాజీ ఎమ్మెల్యే బోడెతో కలిసి ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ, తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 22 లక్షల ఎకరాల్లో 10 వేల కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయని తెలియజేశారు. అదే విధంగా దాదాపు 770 కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతిన్నాయని, తాగునీరు, నీటిపారుదల, విద్యుత్ రంగాలకు నష్టం వాటిల్లిందని కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. పంట నష్టం అంచనా త్వరితగతిన పూర్తిచేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయాన్ని తక్షణం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు ఆయన చెప్పారు. అదే విధంగా రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలిపారు. దెబ్బతిన్న వరి హెక్టారుకు రూ.30 వేలు, మృతుల కుటుంబానికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు, ఇళ్లు కూలిపోతే రూ.1 లక్ష వేరుశనగకు రూ. 25 వేలు, అరటికి హెక్టారుకు రూ. 40 వేలు, పత్తికి హెక్టారుకు రూ. 25 వేలు, మిర్చికి రూ.50 వేలు ఆక్వాకల్చర్‌కు హెక్టార్‌కు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని తక్షణం విడుదల చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజేంద్ర రత్నూను కోరామని తెలియజేశారు. కార్యక్రమంలో పామర్రు నియోజకవర్గ ఇంచార్జి వర్ల కుమార్ రాజా, పెడన ఇంచార్జి కాగిత కృష్ణ ప్రసాద్, కంకిపాడు మాజీ ఎంపీపీ దేవినేని రాజా, మండల అధ్యక్షుడు సుదిమళ్ల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.