ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖలో పర్యటించనున్న కేంద్ర నిపుణుల కమిటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 14, 2023, 03:21 PM

రుషికొండపై పర్యావరణ నిబంధనల ఉల్లంఘనల పరిశీలనకు కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ గురువారం విశాఖపట్నం రానుంది. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించి రుషికొండపై ఏపీటీడీసీ నిర్మాణాలు చేపట్టిందని, పర్యాటక వసతి పేరుతో సీఎం క్యాంపు కార్యాలయాలు నిర్మించిందని ఆరోపిస్తూ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో వేర్వేరుగా కేసులు వేసిన సంగతి తెలిసిందే. కొంతమేరకు నిబంధనలు ఉల్లంఘించినట్లు ఏపీటీడీసీయే అంగీకరించగా.. వాటి వల్ల నష్టం ఎంత అనేది అంచనా వేసి.. అనుమతులు ఇచ్చిన కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖే చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో కేంద్రం వివిధ విభాగాలకు చెందిన ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. దీనికి చెన్నైలోని హెచ్2వో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీస్ సంస్థ సలహాదారు కె.గౌరప్పన్ చైర్మన్‌గా చెన్నై నుంచే మరో ఇద్దరు నిపుణులు, ఏపీలో విజయవాడ నుంచి ఒకరు, విశాఖ నుంచి ఒకరిని సభ్యులుగా నియమించింది. గత నెల 28న ఉత్తర్వులు ఇస్తూ.. పర్యావరణ ఉల్లంఘనలపై రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. గడువు సమీపిస్తుండటంతో ఇప్పుడు కమిటీ విశాఖపట్నం వస్తోంది. ఇక్కడ రుషికొండపై నిర్మాణానికి అనుమతించిన విస్తీర్ణం ఎంత? నిర్మాణాలు ఎంత విస్తీర్ణంలో చేపట్టారు? అందుకోసం చెట్లను నరికి, కొండను తవ్వడం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లిందనే అంశాలను కమిటీ పరిశీలించనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com