నెల్లూరు జిల్లా, అల్లూరులో బుధవారం విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే..... పట్టణంలోని రాజులవీధికి చెందిన గండవరపు శ్రీనివాసులరెడ్డి (55) కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నాడు. మంగళవారం గ్రామ పొలాల్లోకి వెళ్లిన ఆయన రాత్రి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం అటుగా వెళ్తున్నవారు కాలువలో వ్యక్తి పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని వెలికి తీయించారు. మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఆయన పొరపాటున జారి పడి మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిర్యాదు అందని కారణంగా కేసు నమోదు చేయలేదని ఎస్ఐ తెలిపారు.