సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లకు పొరుగు రాష్ట్రాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తానని ప్రతిపక్ష నేతగా హామీలు ఇచ్చారని.. కానీ అధికారంలోకి వచ్చాక వెయ్యి రూపాయలు తక్కువ వేతనాలు ఇవ్వడాన్ని ఏమనాలి? మాట తప్పడం అంటే ఇదే అని మండిపడ్డారు. ఈ విషయాన్నే గుర్తు చేసి నిరసన తెలియచేస్తుంటే వేధింపులకు గురి చేయడం పాలకుల నైజాన్ని తెలియచేస్తోందన్నారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలుకొట్టి పంచనామాలు చేస్తామని చిరుద్యోగులను బెదిరిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న 52 వేల అంగన్వాడీ కేంద్రాల్లో లక్ష మందికిపైగా మహిళలు కార్యకర్తలుగా, హెల్పర్లుగా నామ మాత్రపు వేతనాలకే పని చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అదే విధంగా సుప్రీం కోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ విధానాన్ని వీరికి వర్తింపచేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు జనసేన పార్టీ మద్దతు ప్రకటిస్తుందన్నారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.