జాతీయ రాజధాని న్యూఢిల్లీలో పార్లమెంటు సమావేశాలకు ఏటా కొన్ని మాసాలు హాజరయ్యేందుకు వీలుగా అక్కడ ఎంపీలకు ప్రభుత్వం గృహ నివాస సౌకర్యం కల్పిస్తోంది. రాజ్యసభ, లోక్ సభ సభ్యులైన ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర స్థానాలైన రాష్ట్ర రాజధానుల్లో కూడా పాలనాపరమైన పనుల కోసం ఉండాల్సిరావడంతో అనేక మంది ఎంపీలు సొంత లేదా అద్దె ఇళ్లలో కొన్ని రోజులు అక్కడ బస చేస్తుంటారు. పార్టీల రాష్ట్ర అధ్యక్షులు లేదా చట్టసభల సభ్యులు నిరంతరం ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజల మధ్య తిరగాల్సిన సందర్భాలు, అవసరాలు ఉంటాయి. రెండు దశాబ్దాల క్రితం చట్ట సవరణ చేయక ముందు రాజ్యసభకు పోటీచేయాలనుకునే అభ్యర్థి ఎవరైనా– ఏ రాష్ట్రం నుంచి పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికవ్వాలనుకుంటున్నారో అక్కడ నివాసం ఉంటున్నట్టు రుజువులు చూపించాల్సి వచ్చేది. అంటే, తమిళనాడు నుంచి రాజ్యసభకు పోటీచేయదలచిన నాయకుడు ఆ రాష్ట్రంలో ఎక్కడైనా నివాసం ద్వారా ఓటు హక్కు కలిగి ఉండాలనే నిబంధన 2003 వరకూ ఉండేది. ఈ కారణంగా 1991 జూన్ మాసంలో నాటి పీవీ నరసింహారావు గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేరిన డాక్టర్ మన్మోహన్ సింగ్ జీ అప్పటికీ పార్లమెంటు ఏ సభలోనూ సభ్యులు కాదు. మంత్రి అయిన నేత ఎవరైనా ఆర్నెల్ల లోగా పార్లమెంటుకు ఎన్నికవ్వాలనే నిబంధ ప్రకారం డాక్టర్ సాబ్ అదే ఏడాది ఆగస్టులో అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నిబంధన ప్రకారం అస్సాం రాజధాని నగరం గువాహటీలోని దిస్పూర్ లో నందన్ నగర్, వార్డ్ నం.15లోని 3989 నంబర్ ఇంట్లో అద్దెకుంటున్నట్టు రాజ్యసభకు వేసిన నామినేషన్ పత్రాల్లో మన్మోహన్ జీ రాశారు. ఈ ఇల్లు అస్సాం కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా భార్య, అస్సాం మంత్రి హేమప్రభా సైకియాది. మన్మోహన్ జీ ఆ ఇంట్లో అద్దెకు ఉంటూ, తద్వారా లభించిన ఓటుతో అస్సాం నుంచి కొన్నిసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2003లో రాజ్యసభకు ఎన్నికకు ‘స్థానికత నిబంధన’ తొలగించి ఎవరైనా ఏ రాష్ట్రం నుంచైనా రాజ్యసభకు పోటీచేసే అవకాశం కల్పించారు.