స్మాల్ క్యాప్ కేటగిరి రియల్ ఎస్టేట్ సెక్టార్ కంపెనీ ఆర్డీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ లిమిటెడ్ స్టాక్ అదరగొట్టింది. తమ ఇన్వెస్టర్లను దీర్ఘకాలంలో మిలియనీర్లను చేసింది. ఈ కంపెనీ షేరు గత ఐదేళ్లలో కళ్ళు చెదిరే లాభాలు అందించింది. గత 5 ఏళ్లలో 3056 శాతం లాభాన్ని అందించి మల్టీబ్యాగర్ షేర్లలో ఒకటిగా నిలిచింది. ఒకవేళ 5 ఏళ్ల క్రితం రూ. 1,00,000 పెట్టుబడి పెట్టి షేర్లు కొన్నట్లయితే ఇప్పుడు మీ షేర్ల విలువ దాదాపు రూ. 32 లక్షలు అవుతుంది. ఐదేళ్ల క్రితం రూ. 15.68 వద్ద ఉన్న కంపెనీ షేరు.. ఇప్పుడు రూ. 495 వద్దకు చేరింది.
జనవరి 10, 2025 నాటి దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ టెండర్లలో పాల్గొని రెండు లెటర్ అఫ్ అవార్డ్స్ పొందినట్లు కంపెనీ తెలిపింది. మొదటి ప్రాజెక్టులో భాగంగా జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని డీవీసీ కమాండ్ ప్రాంతంలో వివిధ రకాల బిల్డింగులపై 10 MWP సామర్థ్యం గల గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం కావాల్సిన ఎక్విప్మెంట్స్, స్పేర్ పార్ట్స్ సరఫరా చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. రెండో ఒప్పందం (ప్రాజెక్టు)లో భాగంగా ఐదేళ్ల పాటు సోలార్ పీవీ ప్లాంట్ పూర్తి నిర్వహణ, ఆపరేషన్, మెయింటనెన్స్ చేయాలని తెలిపింది. ఈ ప్రకటన చేసిన క్రమంలో స్టాక్ ఫోకస్‌లోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.
కంపెనీ స్టాక్ అవుట్ లుక్ పరిశీలిస్తే ఇవాళ్టి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఆర్డీబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ షేరు 2.04 శాతం లాభాపడి రూ. 494.85 వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ. 612.65, కనిష్ఠ ధర రూ. 78.30గా ఉంది. గత వారం రోజుల్లో ఈ షేరు 1 శాతం, గత నెల రోజుల్లో 8 శాతం నష్టపోయింది. అయితే గత ఆరు నెలల్లో ఈ షేరు 240 శాతం మేర లాభాలు ఇచ్చింది. గత ఏడాదిలోనే ఈ షేరు 468 శాతం మేర పెరిగింది. గత ఐదేళ్లలో 3056 శాతం లాభాన్ని అందించింది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 855.27 కోట్లుగా ఉంది.