ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో మహా కుంభమేళా ఒకటి. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు సాగే ఈ కార్యక్రమానికి లక్షల మంది భక్తులు వస్తారు. ఈ ఏడాది మొదటి రోజున భారీ ఎత్తున ప్రజలు హాజరైనట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, దివంగత స్టీవ్ జాబ్స్ (Steve Jobs) సతీమణి పావెల్ జాబ్స్ ఈ ఏడాది కుంభమేళాకు వచ్చారు. ప్రయాగ్‌రాజ్ చేరుకుని తన భర్త స్టీవ్ జాబ్స్ కోరికను నెరవేర్చారు. ఆయన 1974లోనే కుంభమేళాకు రావాలని అనుకున్నారట. అందుకోసం ఓ ప్లాన్ సైతం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్లాన్ గురించి స్టీవ్ జాబ్స్ రాసిన ఓ లేఖ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
కుంభ మేళా వెళ్లాలనే ప్లాన్‌పై 1974లో స్టీవ్ జాబ్స్ రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖను బోన్హామ్స్ సంస్థ ఇటీవలే వేలం వేసింది. ఈ వేలంలో స్టీవ్ జాబ్స్ రాసిన లేఖ 500,312 డాలర్లు పలికింది. అంటే భారత కరెన్సీలో దాని విలువ దాదాపు రూ.4.32 కోట్లుగా ఉంటుంది. ఈ విషయాన్ని స్టీవ్ జాబ్స్ స్నేహితుడు టిమ్ బ్రౌన్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన లేఖ వేలం వేసిన క్రమంలో ఆయనలోని ఆధ్యాత్మికత ప్రపంచానికి తెలిసింది. అలాగే స్టీవ్ జాబ్స్‌కు చెందిన వ్యక్తిగత లేఖల్లో వేలానికి వచ్చిన తొలి లెటర్ ఇదే కావడం విశేషం. దీంతో ఈ లేఖను దక్కించుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. దీంతో రూ.4.32 కోట్లుకు పలికింది.
19వ పుట్టిన రోజున స్టీవ్ జాబ్స్ తనకు రాసిన లేఖలో బౌద్ధమతం గురించి ప్రస్తావించారని టిమ్ బ్రౌన్ తెలిపారు. దీంతో పాటుగా భారత దేశంలో జరిగే కుంభమేళాకు వెళ్లాలని ఆశపడుతున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. టిమ్ బ్రౌన్ రాసిన లేఖకు ప్రతిస్పందనగా స్టీవ్ జాబ్స్ ఈ లేఖను రాసినట్లు తెలుస్తోంది. తన భవిష్యత్తు గురించి ఆందోళనగా ఉందని, తాను చాలా సార్లు ఏడ్చానని లేఖలో చెప్పుకొచ్చారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కుంభమేళాకు భారత దేశానికి వెళ్లాలనుకుంటున్నాని లేఖలో చెప్పారు. మార్చిలో వెళ్తానని, కానీ దాని గురించి ఇంకా కచ్చితమైన ప్లాన్ లేదని తెలియజేశారు.
ఈ లేఖను స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి యాపిల్ సంస్థను స్థాపించేందుకు రెండేళ్ల ముందు రాశారు. యాపిల్ సంస్థను స్థాపించిన తర్వాత ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో తమ సంస్థను ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తన చిరకాల వాంఛ తీరకుండానే స్టీవ్ జాబ్స్ కన్నుమూశారు. 2011 అక్టోబర్ 5న 56 ఏళ్ల వయసులో స్టీవ్ జాబ్స్ మృతి చెందారు.