ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా వైభవంగా జరుగుతోంది. నిత్యం వేలాదిమంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. 45 రోజుల పాటు ఈ కుంభమేళా జరగనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారు రైళ్లు, విమానాల ద్వారా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రయాగ్‌రాజ్ వెళ్లే విమానాల టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో ప్రకారం చూసుకుంటే సాధారణ రోజులతో పోలిస్తే ఈ కుంభమేళా రోజుల్లో టికెట్ ధరలు భారీగా చూపిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి ప్రయాగ్‌రాజ్ వన్-వే టికెట్ ధర ఒక్కరికి రూ.2977గా ఉండగా.. అది ఇప్పుడు ఏకంగా 498 శాతం పెరిగి రూ.17,796గా చూపిస్తోంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు బుకింగుల సరాసరి లెక్క ఇది. ఇక రోజు వారీగా చూసుకుంటే ఇంకాస్తే ఎక్కువే ఉంటాయి.
ఇక ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్ విమాన టికెట్ ధరలు 21 శాతం పెరిగి రూ.5748కి చేరాయి. ముంబై నుంచి ప్రయాగ్‌రాజ్ టికెట్ ధర 13 శాతం పెరిగింది. ప్రస్తుతం నెలరోజుల సరాసరి రూ.6381గా ఉంది. ఇక బెంగళూరు నుంచి చూస్తే టికెట్ ధరలు 89 శాతం పెరిగాయి. బెంగళూరు- ప్రయాగ్‌రాజ్ సర్వీసుకు రూ.11,158 చూపిస్తోంది. అహ్మదాబాద్- ప్రయాగ్‌రాజ్ విమాన టికెట్ ధరలు రూ.10వేల పైన ఉన్నాయి. ఇక యూపీలోని లఖ్‌నవూ, వారణాసి నగరాల నుంచి సైతం భారీగానే వసూలు చేస్తున్నారు. ఆయా టికెట్ రేట్లు 3-21 శాతం పెరిగాయి. లఖ్‌నవూ విమాన టికెట్లకు 42 శాతం, వారణాసి విమాన టికెట్లకు 127 శాతం డిమాండ్ పెరిగింది.
ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌కు 20 నగరాల నుంచి వన్ స్టాప్, డైరెక్ట్ విమానాలు సేవలందిస్తున్నట్లు ఇక్సిగో తెలిపింది. ప్రయాగ్‌రాజ్ సమీప మెట్రో నగరాల నుంచి విమాన టికెట్ ధరలు రూ.7-10 వేలుగా చూపిస్తున్నాయి. అయితే, 30 రోజుల ముందుగా బుక్ చేసుకుంటేనే ఈ రేట్లు. ఎమర్జెన్సీ బుకింగులు అయితే ఇక చెప్పనక్కర్లేదు. రెండింతలు, మూడింతలు చూపించినా చూపిస్తాయి. ఇక భోపాల్- ప్రయాగ్‌రాజ్ మార్గంలో విమాన సర్వీసులు తక్కువగా ఉండడంతో ఏకంగా రూ.17 వేలపైన ధరలు చూపిస్తున్నాయి.
ప్రత్యేక రోజుల్లో మరింత ఎక్కువ
ఈ మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించేందుకు కొన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 16, 19, 23, 27, 29 ఫిబ్రవరి 1, 3, 4, 6, 12, 26 ముఖ్యతేదీలుగా ఉన్నాయి. ఆయా రోజుల్లో వసంత పంచమి, అచల సప్తమి, మాఘ పూర్ణిమ, మహా శివరాత్రి వంటి పర్వదినాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా రోజుల్లో విమాన టికెట్ ధరలు అత్యధికంగా చూపిస్తున్నాయి. ఆ రోజులకు గిరాకీ ఎక్కువగా ఉంది. మిగితా రోజుల్లో కాస్త తక్కువగానే ఉన్నాయి. జనవరి 27వ తేదీ ముంబై నుంచి వన్ వే నాన్ స్టాప్ టికెట్ ధర రూ.27 వేలుగా ఉంది.
హైదరాబాద్ నుంచి టికెట్ ధరలు..
ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో ప్రకారం.. హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కి స్పైస్ జెట్, ఇండిగో సంస్థలు విమానాలు నడిపిస్తున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్న క్రమంలో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజుల్లో వన్-వే ధర రూ.5-7 వేల మధ్య ఉండగా ఈ కుంభమేళా సమయంలో గరిష్ఠంగా రూ.29 వేల వరకు చూపిస్తోంది. జనవరి 16వ తేదీన స్పైస్ జెట్ విమాన ఎకానమీ టికెట్ రూ.22,717గా చూపిస్తోంది. ఇక ఇండిగో ఎకానమీ టికెట్ ధర రూ.25,166గా ఉంది. ఇక జనవరి 27వ తేదీన చూసుకుంటే విమాన టికెట్ ధరలూ రూ.29 వేలకుపైగా ఉన్నాయి.