బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొట్టిన భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024 డిసెంబర్ నెలకు గానూ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. డిసెంబర్ నెలకు గాను విజేతను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మంగళవారం (జనవరి 14) ప్రకటించింది. బుమ్రా పురుషుల విభాగంలో బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేన్ ప్యాటర్సన్‌లను వెనక్కి నెట్టి.. బుమ్రా ఈ అవార్డును గెలుచుకున్నాడు.
డిసెంబర్లో జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఈ నెలలో 3 టెస్టులు జరిగాయి. వాటిలో 14.22 సగటుతో 22 వికెట్లు తీశాడు భారత పేసర్. నాలుగు, ఐదో మ్యాచ్‌ల్లోనూ మరో 10 వికెట్లు తీశాడు. మొత్తంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా మొత్తం 32 వికెట్లు తీశాడు. వెన్నునొప్పి కారణంగా సిడ్నీ టెస్టులో అతడు బౌలింగ్ చేయలేదు. మొత్తంగా 9 ఇన్నింగ్స్‌లలోనే బుమ్రా 32 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో బుమ్రా.. ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు.
ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌కు గానూ.. బుమ్రాకు మరో ఇద్దరి నుంచి పోటీ ఎదురైంది. అందులో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, దక్షిణాఫ్రికా పేసర్ ప్యాటర్సన్ ఉన్నారు. డిసెంబర్లో భారత్‌తో జరిగిన మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్.. 17.64 సగటుతో 17 వికెట్లు తీశాడు. ఇక ప్యాటర్సన్.. శ్రీలంక, పాకిస్థాన్లతో టెస్టుల్లో రాణించాడు. రెండు టెస్టుల్లో కలిపి 13 వికెట్లు తీశాడు.
ఇక మహిళల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును కూడా ఐసీసీ ప్రకటించింది. ఈ అవార్డును ఆస్ట్రేలియాకు చెందిన అన్నాబెల్ సదర్లాండ్ సొంతం చేసుకుంది. భారత్, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లలో ఆమె మెరుగైన ప్రదర్శన చేసింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఆమె గెలుచుకుంది.