మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లలో భద్రతా బలగాలు అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలు ప్రయోగిస్తున్నాయా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో విషపూరిత షెల్స్ వాడారని మావోయిస్టు పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ ఘటన నుంచి బయటపడిన ఓ మావోయిస్టు అగ్రనేత 'ఫినిక్స్' పేరుతో రాసిన ఓ రిపోర్ట్ ఇప్పుడు కలకలం రేపుతోంది.గతేడాది ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లా కుల్హదీఘాట్ అడవుల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్ డీఆర్‌జీ, ఒడిశా ఎస్‌వోజీ, సీఆర్‌పీఎఫ్ కోబ్రా బెటాలియన్లు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. సుమారు 48 గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి సహా 16 మంది మావోయిస్టులు మరణించారు.ఈ ఎన్‌కౌంటర్ నుంచి ప్రాణాలతో బయటపడిన మావోయిస్టు నేత, పార్టీకి పంపిన నివేదికలో సంచలన విషయాలు పేర్కొన్నారు. బలగాలు తమపై తీవ్రమైన షెల్లింగ్‌కు పాల్పడ్డాయని, ఆ ముక్కలు తగిలిన సహచరులు కేవలం గాయాలతోనే కాకుండా భరించలేని మంట, నొప్పితో విలవిల్లాడారని తెలిపారు. తీవ్రమైన దాహం, వాంతులతో నరకయాతన అనుభవించారని ఆ రిపోర్టులో వివరించారు.గతంలో లొంగిపోయిన మావోయిస్టు నేత జంపన్న ఈ నివేదికను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టడంతో ఈ అంశంపై చర్చ మొదలైంది. రసాయన ఆయుధాల వినియోగాన్ని నిషేధించే అంతర్జాతీయ ఒప్పందం పై భారత్ సంతకం చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa