ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మృతిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆగ్రహం

international |  Suryaa Desk  | Published : Mon, Mar 02, 2026, 07:30 AM

ఇరాన్ దేశ అత్యున్నత నేత అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చడంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆత్మరక్షణ విషయంలో తమకు ఎలాంటి పరిమితులు, హద్దులు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణకు ప్రతీకారంగానే తాము దాడులు చేస్తున్నామని పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థ అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరాగ్చీ మాట్లాడుతూ తమ సుప్రీం లీడర్‌ను హత్య చేయడం చాలా తీవ్రమైన చర్య అని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలను బాహాటంగా ఉల్లంఘించాయని ఆరోపించారు. ఈ పరిణామంతో పశ్చిమాసియాలో ఘర్షణలు మరింత సంక్లిష్టంగా, ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఆత్మరక్షణలో భాగంగా అమెరికా దురాక్రమణకు ప్రతీకారంగానే తాము దాడులు చేస్తున్నామన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో కేవలం అమెరికా బలగాలు, సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుంటున్నామని చెప్పారు. గల్ఫ్ దేశాలతో తమకు ఇబ్బందులు లేవని, వారితో స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాలపై ఆయా దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. కొన్ని దేశాలు తమపై ఆగ్రహంగా ఉన్నాయని, అయితే ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్, అమెరికాలే మొదలు పెట్టాయని, కావున ఆ కోపమేదో వాటిపై ప్రదర్శించాలన్నారు. దాడులను ఆపాలని తమపై కాకుండా ఆ రెండు దేశాలపై ఒత్తిడి తీసుకురావాలని అరాగ్చీ హితవు పలికారు. దేశంలో నాయకత్వ మార్పు ప్రక్రియపై మాట్లాడుతూ సుప్రీం లీడర్ ఎన్నిక విధివిధానాల గురించి రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపర్చి ఉన్నట్లు తెలిపారు. కొత్త లీడర్‌ను ఎన్నుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, ప్రతిదీ న్యాయ వ్యవస్థ, రాజ్యాంగానికి అనుగుణంగా కొనసాగుతుందని తెలిపారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa