ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను, ముఖ్యంగా రాయలసీమ రైతాంగ ప్రయోజనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొరుగు రాష్ట్రాలకు తాకట్టు పెట్టారని వైయస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో 'రాయలసీమ ఎత్తిపోతల పథకం' సాధన కోసం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ఆమోదించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని తక్షణమే పునరుద్ధరించి, పూర్తి చేయడంతో పాటు, కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపును అడ్డుకోవాలని, పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41 మీటర్లకు తగ్గించడాన్ని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వైయస్ జగన్ హయాంలో 90 శాతం పూర్తైన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డంగా నిలిపివేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో మాట్లాడుతూ.. చంద్రబాబుతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకే ఈ పనులు ఆపేశామని చెప్పారని.. కేవలంతన వ్యక్తిగత కేసుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం సీమను ఎడారిగా మార్చడానికి చంద్రబాబు సిద్ధపడ్డారు" అని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. పక్క రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు కనీసం అభ్యంతరం తెలుపుతూ లేఖ కూడా రాయకపోవడం దారుణమని ఆక్షేపించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతూ భూసేకరణ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని, అప్పర్ భద్ర వల్ల అనంతపురం జిల్లాకు జరగబోయే నష్టాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రజలు కూటమి నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో భాగంగా వైయస్ఆర్సీపీఅన్ని పక్షాలను, మేధావులను, యువతను కలుపుకుని ఉద్యమిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa