ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ ముందే వస్తుందా?,,,సీఎం జగన్ వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏమిటి?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2023, 06:40 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ మొదలైంది. ఈసారి 15 రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇప్పటినుంచే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లు భావించి పనిచేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు. వైఎస్ జగన్ చేసిన ఈ వ్యాఖ్యలతో రాజకీయ వర్గాలు అలర్ట్ అయ్యాయి. 15 రోజులు ముందే ఎన్నికలు వస్తాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏపీలో ఎన్నికలు ఏ నెలలో ఉంటాయనే చర్చ మొదలైంది. కిందటిసారి ఏ తేదీల్లో ఎన్నికలు జరిగాయి? ఈసారి ఎన్నికల ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఆ వివరాలు..


ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పటిలాగే లోక్‌సభ ఎన్నికలతో జరుగుతాయనేది మాత్రం ఇప్పటికే స్పష్టమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి అయితే ఏమాత్రం లేదు. ఒకవేళ.. ముందుగానే ప్రభుత్వాన్ని రద్దు చేసినా.. ఎన్నికలకు 6 నెలల కంటే తక్కువే గడువు ఉంది కాబట్టి ఎప్పటిలాగే నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారనేది సుస్పష్టం. ఇక కిందటిసారి సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో పోలింగ్ జరిగింది. ఏపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి విడతలోనే ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. దేశంలో అన్ని దశల పోలింగ్ పూర్తైన తర్వాత మే 23న ఫలితాలను విడుదల చేశారు.


ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. వైఎస్ జగన్ 2019 మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సైతం రెండోసారి ప్రధానిగా అదే రోజు (మే 30) ప్రమాణస్వీకారం చేశారు. అంటే ప్రస్తుత ప్రభుత్వానికి 2024 మే 30 వరకు గడువు ఉంది. నిబంధనల ప్రకారం.. ఈ లోపే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలను వెల్లడించాల్సి ఉంటుంది. సాధారణంగా గడువు పూర్తవడానికి 3 నెలల ముందే ఎన్నికల సంఘం.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తుంది. ప్రభుత్వ కాలపరిమితి పూర్తవడానికి 40 నుంచి 50 రోజుల ముందే ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ మూడో వారంలో నోటిఫికేషన్ వెలువడవచ్చని భావిస్తే.. అది పొరపాటే. లోక్‌సభ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు ఉంటాయి, అందులోనూ మొదటి విడతలోనే ఏపీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అంతకంటే 40 రోజుల ముందే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.


కిందటిసారి సార్వత్రిక ఎన్నికలకు 2019 మార్చి 18న నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఆ లెక్కన చూసుకున్నా.. ఈసారి 2024 మార్చి మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతకంటే 15 రోజుల ముందే నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు. అదే నిజమైతే.. మార్చి మొదటి వారంలోనే ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావొచ్చు..! అంటే.. ఇంకో 70 -75 రోజుల్లో ఏపీలో ఎన్నికల సందడి మొదలు కానుందన్నమాట. ఆ మాటకొస్తే.. తాజా రాజకీయ పరిణామాలతో ఏపీలో అప్పుడే ఎన్నికల అలజడి మొదలైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com