ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ముగిసింది. అమరావతి సచివాలయం మొదటి బ్లాక్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ఈ భేటీలో సామాజిక పెన్షన్లు, ఆరోగ్య శ్రీ చికిత్స పరిమితి పెంపు సహా మొత్తం 45 అంశాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంది. యాంటి నక్సల్ ఆపరేషన్‌లో పాల్గొనేవారికి 15 శాతం అలవెన్స్ పెంపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కోర్టు సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపులపై క్యాబినెట్‌లో చర్చించారు.
జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3,000కు పెంపు, ఆరోగ్య శ్రీలో చికిత్స పరిమితి రూ.25 లక్షలకు పెంపు, జనవరిలో వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాల అమలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మిచౌంగ్ తుఫాను పరిహారం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఆమోదముద్ర వేసింది. ఇక, విశాఖ వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో ప్రాజెక్ట్‌కు సంబంధించి లైట్ మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్‌ను క్యాబినెట్ ఆమోదించింది. జనవరి నుంచి ప్రారంభం కానున్న జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడతకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలు, 50 ఎకరాలలోపు ఉన్న 110 భూ కేటాయింపులను ఏపీఐఐసీకి అప్పగించడంపై చర్చ జరిగింది. ఏపీ స్టేట్ సీసీ టీవీ సర్వైవలెన్స్ ప్రాజెక్ట్‌కి రూ.552 కోట్లు బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడంపై కూడా చర్చించారు. 11 వైద్య కళాశాలల్లో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలు ఏర్పాటుకు ఆమోదం.. ఇందులో సిబ్బంది నియామాకానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. విశాఖలో ఓ ప్రయివేట్ విద్యా సంస్థకు 11 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపింది.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటు ప్రతిపాదనలు, ‘ఆడుదాం ఆంధ్ర’పై కేబినెట్‌లో చర్చించారు. సాధారణ ఎన్నికల నిర్వహణకు అదనంగా 982 తాత్కాలిక పోస్టుల సృష్టించాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. సీఐడీ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి విజయవాడ లోని రాయనపాడులో 20 సెంట్లు కేటాయింపు, వైఎస్ఆర్ జగన్న శాశ్వత భు హక్కు, భూ రక్ష పథకం కోసం కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, క్యాబినెట్ సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా పని చేయాలని సూచించారు. గతం కంటే 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున.. ఎన్నికలకు పూర్తి సన్నద్దంగా ఉండాలని దిశనిర్దేశనం చేశారు. తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలని అన్నారు.