అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. రాయుడు ఇప్పటికే సీఎం జగన్‌ను కలిశారు. దీంతో ఆయన వైఎస్సార్సీపీలో చేరతారని.. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కొంత కాలంపాటు సైలెంట్ అయిన.. రాయుడు ఇటీవల మళ్లీ జనం మధ్య కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ జాఫర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన అంబటి రాయుడు తన పొలిటికల్ ఎంట్రీ గురించి, ఏపీ రాజకీయాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జనాలకు మంచి చేయడానికి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైనా చేయాలనే తపనతో ఉన్న తనను జనం నమ్ముతారని అంబటి రాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ పార్టీలో చేరాలనే విషయమై తాను ఇంకా ఓ నిర్ణయానికి రాలేదన్నారు. అయితే జగన్ పార్టీ సిద్ధాంతాలు తనకు ఇష్టమన్నారు. సమాజంలో అందరూ బాగుపడాలని జగన్ కోరుకుంటున్నారన్న రాయుడు.. తనకు కులాలు, మతాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు.
కులాల వారీగా జనాలను విడగొట్టడం తనకు ఇష్టం లేదన్న రాయుడు.. వైఎస్సార్సీపీ అందర్నీ సమానంగా చూస్తోందన్నారు. ‘నేను ఇప్పటి దాకా చాలా స్కూల్స్ చూశాను. ఎడ్యుకేషన్, స్పోర్ట్ తదితర విషయాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డెవలప్‌మెంట్ విషయంలో తగిన శ్రద్ధ పెడుతోంది. అయితే జగన్ పాలనలో రెండున్నరేళ్ల కాలం కరోనా ప్రభావమే ఉంది కదా’ అని రాయుడు వ్యాఖ్యానించారు. ‘మా తాతయ్య టీడీపీ తరఫున సర్పంచ్‌గా పని చేశారని జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదు. ఆయన చనిపోయిన చాలా కాలం తర్వాత టీడీపీ ఏర్పాటైంది. ఆయన అప్పట్లో స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశార’ని రాయుడు తెలిపారు.
ఎమ్మెస్కే ప్రసాద్‌ది, చంద్రబాబుది ఒకే క్యాస్ట్ కావడం వల్లే తాను వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నానన్న ప్రచారంలో వాస్తవం లేదని రాయుడు తెలిపారు. ‘30 ఏళ్ల నుంచి నా క్లోజెస్ట్ ఫ్రెండ్‌ది అదే క్యాస్ట్. వాడు నా కోసం ప్రాణమైనా ఇస్తాడు గానీ ఓటైతే వేయడు’ అంటూ అంబటి రాయుడు సరదాగా నవ్వుతూ వ్యాఖ్యానించారు. కులాల కుమ్ములాటలు ఆంధ్రప్రదేశ్ సమస్య అన్న రాయుడు.. దీన్ని మనం అధిగమించాలన్నారు. క్రీడలు ఇందుకు సహకరిస్తాయన్నారు. అందర్నీ ఒక్కటి చేయడానికి, ఏకతాటిపైకి తీసుకు రావాడానికి క్రీడలు తోడ్పడతాయన్నారు. ఆడుదాం ఆంధ్రా అనేది మంచి కార్యక్రమమన్నారు.
‘‘అసెంబ్లీకి వెళ్లాలా..? పార్లమెంట్‌కు వెళ్లాలా..? అని కాదు గానీ.. జనాల్లోకి వెళ్లాలని ఉంది. ఇందుకోసం ఓ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. మనం తప్పు చేయమని నమ్మినప్పుడు ఏదో ఒకరోజు జనం మనల్ని నమ్ముతార’’ని రాయుడు తెలిపారు. ‘ప్రజాసేవలోకి వస్తాను.. అది వంద శాతం గ్యారెంటీ. నేను కాపును కాకపోతే జగన్ ఇంత ప్రియారిటీ ఇస్తారా అనేది జగన్‌నే అడగండి. కానీ జెన్యూన్‌గా పని చేసే వాళ్లను ఆయన రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. జగన్‌ను కలిసినప్పుడు క్రీడల పరంగా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చని చర్చించాను.
‘‘జగన్ మళ్లీ సీఎం అవుతారో కారో చెప్పడానికి నేనేమీ జ్యోతిషుణ్ణి కాదు. కానీ నేనైతే టికెట్ కోసం, పదవి కోసం జనాల్లోకి రాలేదు. నేను చనిపోయేలోగా ఇండియాకు ఆడలేకపోతే నా జీవితం వేస్ట్ అనుకున్నాను. భారత్ తరఫున ఆడటం కంటే పెద్ద లక్ష్యమేమీ నా జీవితం లేదు. పదవులు నన్ను ఎగ్జయిట్ చేయవు. జనాలకు మంచి చేయలను అని నమ్ముతున్నాను కాబట్టే ప్రజల్లో తిరుగుతున్నాను’ అని రాయుడు వ్యాఖ్యానించారు.