పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి చనిపోయారు. ఉండి మండలం చెరుకువాడ జాతీయ రహదారిపై రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొట్టుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉపాధ్యాయ నియోజకవర్గాల పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి కన్నుమూశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కారు డ్రైవర్, గన్మెన్, పీఏకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ సాబ్జీ అంగన్వాడీ కార్యకర్తల సమ్మెలో భాగంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆయన ఏలూరు నుంచి భీమవరం వెళుతుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్సీ సీటు బెల్ట్ పెట్టుకోలేదని చెబుతున్నారు. అందుకే ఆయన చాతికి, తలకు బలమైన గాయాలు కావడంతో చనిపోయినట్లు తెలుస్తోంది.