తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని డిసెంబరు 19వ తేదీన మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా డిసెంబరు 19న బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా డిసెంబరు 18న సోమవారం సిఫారసు లేఖలు స్వీకరించబడవు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది. ధర్మప్రచారంలో భాగంగా నాలుగు వేదాల సారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు 2024 ఫిబ్రవరి మొదటి వారంలో సహస్రపురుష వేదస్వస్తి చతుర్వేద పారాయణం నిర్వహిస్తామని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం నిర్వహణపై తిరుపతిలోని పరిపాలన భవనంలో గురువారం అధికారులతో జెఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ లోకక్షేమం కోసం ప్రజలందరికీ శాంతి సౌభాగ్యాలు, ఆరోగ్యం, అభ్యుదయం కలగాలని ఆకాంక్షిస్తూ ఈ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తామని, ఇందుకోసం టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ప్రముఖ పండితులను ఆహ్వానించాలన్నారు. శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలోని స్కీమ్ పారాయణదారులను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆయా విభాగాల అధికారులు సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఇందుకోసం ఆహారం, వైద్యం, బస, కార్యక్రమ నిర్వహణ, రవాణా తదితర కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు తరచూ సమావేశాలు నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎస్వీ వేద వర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ శ్రీ రాధేశ్యామ్, సిఏవో శ్రీ శేషశైలేంద్ర, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ రాజగోపాల్, హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీ సోమయాజులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ స్థానికాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు
టీటీడీ స్థానికాలయాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. డిసెంబరు 16వ తేదీ రాత్రి 12.34 గంటలకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 17 నుంmr జనవరి 14వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 4 నుండి 6 గంటల వరకు సుప్రభాతం స్థానంలో ఏకాంతంగా తిరుప్పావై పారాయణం, భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఈ కారణంగా సుప్రభాతం సేవా టికెట్లు జారీ చేయరు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. మొదటిరోజైన డిసెంబరు 17న సాయంత్రం ధనుర్మాసం గంట కారణంగా సహస్రదీపాలంకార సేవ రద్దయింది. ఆలయంలో నెల రోజుల పాటు ఉదయం 4.30 నుండి 6 గంటల వరకు ధనుర్మాసం గంట, ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 4 నుంచి 5.30 గంటల వరకు సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పారాయణం, భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఉదయం 4 నుండి 5 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు.