ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ సీఈఓలు సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లలు క్రికెట్‌లోకి అడుగుపెడుతున్నారు. అవునండీ అది నిజమే. అయితే క్రికెట్ ఆడేందుకు కాదు. లండన్‌కు చెందిన క్రికెట్ జట్టు కోసం వేలం వేసే సిలికాన్ వాలీ ఎగ్జిక్యూటివ్‌ల కన్సార్టియంలో ఈ ఇరువురు సీఈఓలు చేరారు. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ వంటి టాప్ టెక్ సీఈఓలతో కూడిన ఈ కన్సార్టియం క్రికెట్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. లండన్‌కి చెందిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ లేదా లండన్ స్పిరిట్ జట్టు కోసం బిడ్లు వేయనుంది. 80 మిలియన్ పౌండ్లు అంటే దాదాపు 97 మిలియన్ డాలర్లు బిడ్ కోసం వెచ్చించనున్నారట. భారత కరెన్సీలో దీని విలువ రూ.805 కోట్లకుపైగా ఉంటుంది.
టెక్ ఎగ్జిక్యూటివ్‌ల గ్రూప్‌నకు పాలో ఆల్టో నెట్‌వర్క్ సీఈఓ నికేశ్ అరోరా, టైమ్స్ ఇంటర్నెట్ లిమిటెడ్ వైస్ ఛైర్మన్ సత్యన్ గజ్వానీ నేతృత్వం వహిస్తున్నారు. యువ క్రికెట్ అభిమానులను ఆకర్షించేందుకు నిర్వహిస్తోన్న క్రికెట్ టోర్నమెంట్ ది హండ్రెడ్‌లో 8 జట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రైవేట్ పెట్టుబడులను పొందడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు చేసిన ప్రయత్నంలో క్రికెట్ జట్లను దక్కించుకునేందుకు టెక్ సీఈఓల గ్రూప్ బిడ్లు దాఖలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ది హండ్రెడ్ లీగ్ 2021లో ప్రారంభమైంది. ఇందులో 100 బాల్ ఫార్మాట్ అనుసరిస్తున్నారు. ఈ లీగ్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. లీగ్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ప్రతి ఒక్క జట్టు యూకేలోని ఒక నగరానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఓవల్ ఇన్విన్సిబుల్ లేదా లండన్ స్పిరిట్ జట్టు కోసం బిడ్ వేసే గ్రూప్‌లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవలే చేరారు. తనకు క్రికెట్ అంటే ఇష్టమని పలు సందర్భాల్లో ఆయన చెప్పారు. ఎప్పటికప్పుడు క్రికెట్ సంబంధిత అంశాలపై స్పందిస్తుంటారు. ఇటీవల టీమ్ ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసలు కురిపించారు. ఆస్ట్రేలియా, భారత్ మధ్య గబ్బా వేదికగా జరిగిన టెస్టులో బుమ్రా బౌలింగ్‌పై స్పందించారు.