ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇది ఆధునిక దుశ్శాసనుల లోకం.. సాయం చేయడానికి ఏ కృష్ణుడూ రాలేదు: కర్ణాటక హైకోర్టు

national |  Suryaa Desk  | Published : Fri, Dec 15, 2023, 11:20 PM

నిశ్చితార్ధం జరగాల్సిన ఓ యువతి.. ముందు రోజు రాత్రి తన గ్రామానికి చెందిన యువకుడితో ఇంటి నుంచి పారిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యువతి బంధువులు.. ఆ యువకుడి ఇంటిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా అతడి తల్లిని లోపలి నుంచి ఈడ్చుకొచ్చి, వివస్త్రను చేసి ఊరేగించారు. అనంతరం ఓ విద్యుత్ స్తంభానికి కట్టేసి హింసించారు. అయితే, ఇంత దారుణం జరుగుతున్నా.. ఆమెను కాపాడేందుకు ఓ ఒక్కరూ ముందుకు రాలేదు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన డిసెంబరు 11న కర్ణాటకలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకుంది.


బెళగావి జిల్లా కాకతి పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి వివాహం కుదిరింది. డిసెంబరు 11న నిశ్చితార్ధానికి ముహూర్తం నిర్ణయించారు. అయితే, ఆ యువతి.. అదే గ్రామానికి చెందిన యువకుడితో డిసెంబరు 10న రాత్రి వెళ్లిపోయింది. దీంతో యువకుడి తల్లిని (42) ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చి, వివస్త్రను చేసి ఊరేగించారు. ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటాగా స్వీకరించింది. ఈ ఘటనను మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణంతో పోల్చింది. ఇది ఆధునిక దుర్యోధన, దుశ్శాసనుల లోకమని, ఆమెను రక్షించడానికి ఏ కృష్ణుడూ రాలేదని జస్టిస్‌ ప్రసన్న బాలచంద్ర వరాళె, జస్టిస్‌ కృష్ణ ఎస్‌.దీక్షిత్‌ల ధర్మాసనం ఆవేదన వ్యక్తం చేసింది. మహిళల్లో భయం ఎలా ఉంటుందో అది అభద్రతా భావాన్ని కలిగిస్తుంది. మహాభారతంలో కూడా అలా జరగలేదు. మహాభారతంలో ద్రౌపదికి సహాయం చేయడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు.. కానీ ఆధునిక ప్రపంచంలో ఆమెకు సహాయం చేయడానికి ఎవరూ రాలేదు. దురదృష్టవశాత్తు.. ఇది దుర్యోధనులు, దుశ్శాసనుల ప్రపంచం’ అని వ్యాఖ్యానించింది.


‘ఇంట్లోకి చొరబడి మహిళపై నిందితులు దాడి చేస్తున్నప్పుడు, బయటకు లాక్కొచ్చి వివస్త్రను చేసి ఊరేగించినప్పుడు.. తర్వాత స్తంభానికి కట్టేసి కొడుతున్నప్పుడు ఏ ఒక్కరూ స్పందించలేదు.. కనీసం మానవత్వాన్ని, ధైర్యాన్ని చూపించకపోవడం దురదృష్టకరమ’ని వాపోయారు. ‘ద్రౌపది వస్త్రాపహరణాన్ని అడ్డుకునేందుకు నాడు కృష్ణుడు వచ్చాడు.. ఇప్పటి దుశ్శాసనుల కాలంలో మహిళ మానరక్షణకు ఎవరూ రాలేదు.. చట్టం పట్ల నిందితులకు భయం లేదని ఈ ఘటన చాటి చెబుతుంది. పేదలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలి. ఇలాంటి సమాజంలో బతకడం కన్నా చావడం మేలు అనే స్థితి రాకుండా చూసుకోవాలి’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.


‘పిల్లలు చేసిన తప్పునకు ఆ తల్లికి శిక్ష విధించడం దారుణం.. ఆమెను అవమానించిన, అమానుషంగా ప్రవర్తించిన వారిని మనుషులని పిలవడం కూడా తప్పే. రెండు గంటల పాటు ఆమె అనుభవించిన మానసిక క్షోభను ఊహించలేం’ అని న్యాయమూర్తులు ఆవేదనకు గురయ్యరు. నిందితులపై చేపట్టినన చర్యలు, మహిళా కమిషన్‌, మానవ హక్కుల కమిషన్‌ దర్యాప్తు వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని అడ్వొకేట్ జనరల్‌ శశికిరణ్‌ శెట్టిని ఆదేశించింది.


‘మనం సమానత్వం లేదా ప్రగతిశీలతను చూడబోతున్నామా? లేదా 17, 18 వ శతాబ్దాలకు తిరిగి వెళ్తున్నామా? వేదన మమ్మల్ని ఇలాంటి కఠినమైన పదాలను ఉపయోగించేలా చేస్తుంది.. వేదనను వ్యక్తం చేయడం సహా ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాం.. ఇది భవిష్యత్తు తరాన్ని ప్రభావితం చేస్తుంది. మంచి భవిష్యత్తు కోసం కలలు కనే అవకాశం ఉన్న సమాజాన్ని మనం సృష్టిస్తున్నామా? లేదా ఎవరైనా జీవించడం కంటే చనిపోవడమే మేలని భావించే సమాజాన్ని సృష్టిస్తున్నామా? స్త్రీకి గౌరవం ఎక్కడ ఉంది’ అని ధర్మాసనం మండిపడింది. కాగా, ఈ దారుణంపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సభ్యుడు డాక్టర్‌ ఎస్‌కే వంటిగోడి తెలిపారు. గురువారం ఆయన ధార్వాడలో విలేకరులతో మాట్లాడుతూ తమ కమిషన్‌ సభ్యులు ఇప్పటికే బాధితురాలిని కలిసి వివరాలు ఆరా తీశారని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com