దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల రంగం శరవేగంగా విస్తరిస్తున్నదని కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ ప్రకటించారు. రాజ్యసభలో శుక్రవారం వైయస్ఆర్‌సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఎలక్ట్రానిక్స్, టెలికాం నెట్‌వర్కింగ్ ఉత్పత్తుల రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాల (పిఎల్‌ఐ) పథకం సత్ఫలితాలను ఇస్తోందని చెప్పారు. టెలికాం నెట్‌వర్కింగ్ ఉత్పాదనల రంగం కోసం 2021 జూన్‌లో పిఎల్‌ఐ పథకం ప్రారంభించగా అతి తక్కువ కాలంలోనే దేశంలో టెలికాం ఉత్పత్తుల సంఖ్య గణనీయంగా పెరిగాయని ఆయన తెలిపారు. 2022 అక్టోబర్‌లో ప్రభుత్వం టెలికాం టెక్నాలజి డెవలప్‌మెంట్ ఫండ్ (టిటిడిఎఫ్)ను ప్రారంభించింది. గ్రామీణ, సుదూర ప్రాంతాలలో టెలికాం సేవలు అందిచేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, టెలికాం ఉత్పాదనల తయారీపై పరిశోధనలు, అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రారంభించిన టిటిడిఎఫ్ కారణంగా స్టార్టప్‌లు, ఎంఎస్‌ఎంఈలు, విద్యా పరిశోధన సంస్థల నుంచి ప్రభుత్వానికి 405 దరఖాస్తులు అందాయి. పరిశీలన అనంతరం అందులోని 8 దరఖాస్తులకు 266 కోట్ల రూపాయల మేరకు ఆమోదించినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వం చొరవతో చేపట్టిన చర్యల కారణంగా 2014-15లో 1,80,45ల కోట్ల రూపాయలు ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పాదన 2022-23 నాటికి 8,22,350 కోట్ల రూపాయలకు చేరుకుంది. సెమికాన్ ఇండియా కార్యక్రమం కింద గుజరాత్‌లోని సనద్‌లో దేశంలో తొలి సెమికండక్టర్ యూనిట్ నిర్మాణం జరుగుతోంది. మరో ప్రముఖ సెమికండక్టర్ కంపెనీ బెంగళూరులో సెమికండక్టర్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోందని మంత్రి వెల్లడించారు. మరో ప్రముఖ సెమికండక్టర్ కంపెనీ సెమికండక్టర్ టెక్నాలజీలలో పెద్ద ఎత్తున నిపుణులైన ఇంజనీర్లను తయారు చేసేందుకు ఇండియన్ ఇన్‌నస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌తో ఒప్పందం చేసుకున్నది. అలాగే 2014-15 మధ్య దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ 18,900 కోట్ల రూపాయలు ఉండగా 2022-23 నాటికి 3,50,000 కోట్ల రూపాయలకు పెరిగింది. 2014లో 78 శాతం మొబైల్ ఫోన్లు దిగుమతి అవుతుండగా మేడిన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఈనాటికి 99.2 శాతం మొబైల్ ఫోన్ల తయారీ దేశంలోనే జరుగుతోందని మంత్రి వివరించారు.