అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం పూర్తి కావచ్చింది. మొదటి అంతస్తు పూర్తి కావడంతో జనవరి 22న ఆలయ ప్రతిష్ఠకు ముహూర్తంగా నిర్ణయించారు. దీంతో ఈ మహాక్రతువునకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆలయ దర్శనానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్యకు మొదటి 100 రోజుల్లో 1000 రైళ్లను నడపాలని రైల్వే భావిస్తోంది. ఈ రైళ్లు జనవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 22న ప్రతిష్ఠ జరిగిన మర్నాడు నుంచి ఆలయంలోకి భక్తులను అనుమతించనున్నారు.
ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పుణే, కోల్‌కతా, నాగ్‌పూర్, లక్నో, జమ్మూ సహా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు రైళ్లను నడపనున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదిత రైళ్ల సంఖ్యను అమలు చేయవచ్చు.. అయోధ్యలోని స్టేషన్ కూడా అధిక సంఖ్యలో ప్రయాణికులకు అనుగుణంగా పునరుద్ధరించారు’ అని పేర్కొన్నారు. రోజుకు దాదాపు 50,000 మంది రాకపోకలు సాగించే సామర్థ్యంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇది జనవరి 15 నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని చెప్పాయి.
కొన్ని రైళ్లను యాత్రికుల బృందాలు కూడా అయోధ్యకు చార్టర్డ్ సర్వీస్‌గా బుక్ చేస్తున్నాయని వర్గాలు తెలిపాయి. ఐఆర్సీటీసీ కూడా పెద్ద సంఖ్యలో యాత్రికులు సందర్శించే ఈ 10-15 రోజులలో క్యాటరింగ్ సేవలను అందించడానికి కూడా సిద్ధమవుతోంది. డిమాండ్‌కు తగ్గట్టుగా అనేక ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తుంది. రాముడి జన్మస్థలాన్ని సందర్శించే యాత్రికులకు పవిత్ర సరయూ నదిపై అదనపు ఆకర్షణగా ఎలక్ట్రిక్ బోటు ప్రయాణం. ఇందులో 100 మంది వ్యక్తులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa