ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కెనడా ప్రధాని భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు. తమ బహిరంగ ప్రకటనలతో భారత్ భవిష్యత్తు కార్యాచరణ విషయంలో వెనుకడుగు వేసిందని బీరాలు పోయారు. భారత్‌పై చేసిన ఆరోపణలను సమర్థించుకొనే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. హౌస్ ఆఫ్ కామన్స్‌లో తాను చేసిన ప్రకటన భారత్‌కు అతిపెద్ద అడ్డంకిగా మారి కెనడాను సురక్షిత ప్రదేశంగా మార్చేందుకు దోహదపడిందని చంకలు గుద్దుకున్నారు.
కెనడాకు చెందిన సీటీవీ న్యూస్‌కు సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్య కేసులో భారత్‌కున్న సంబంధాలు మీడియాకు లీకయ్యే అవకాశం ఉండటంతో ముందుగా తానే సెప్టెంబర్ 18న బహిర్గతం చేశానని కెనడా ప్రధాని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలపై ప్రభుత్వానికి పూర్తి పట్టుందని కెనడా పౌరులకు తెలియజేయడానికి ఈ చర్య ఉపయోగపడిందని అన్నారు.
‘కెనడాలో చాలా మంది అభద్రతాభావంతో ఉన్నారు.. ముఖ్యంగా నిజ్జర్ హత్య తర్వాత బ్రిటిష్ కొలంబియాలో సిక్కుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. దీని వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని మాకు తెలుసు లేదా నమ్మడానికి మాకు విశ్వసనీయమైన కారణాలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణకు అవసరమైన అన్ని దౌత్య, భద్రతా చర్యలు చేపట్టడంతోపాటు ఇలాంటి ఇంకో ఘటన చోటుచేసుకోకుండా మరోస్థాయి నిరోధకం ఉండాలని భావించాం.. ఈ క్రమంలో వారు (భారత్) ఇలాంటి మరో చర్య తీసుకోకుండా అడ్డుకోవాలనుకున్నాం’ అని ట్రూడో వివరించారు. వాస్తవానికి ఇప్పటికే ట్రూడో ఆరోపణలను భారత్ తిరస్కరించిన విషయం తెలిసిందే.
కాగా, ఈ ఏడాది జూన్ 18న ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ను బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారా వద్ద గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో పార్లమెంట్ వేదికగా చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ట్రూడో ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్.. ఈ ఆరోపణలను నిరూపించే ఆధారాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. వాటిని పరిశీలించిన తర్వాతే ఈ కేసుపై తదుపరి చర్యలు తీసుకుంటామని పలుమార్లు కెనడాకు స్పష్టం చేసింది.
తాజా ఇంటర్వ్యూలోనూ తన బహిరంగ ఆరోపణల తర్వాత భారత ప్రభుత్వం తమపై తప్పుడు సమాచారంతో దాడి చేసి అణగదొక్కాలని భావించిందని ఆరోపించారు. ‘వారు మాపై దాడి చేయడానికి ఎంచుకున్నారు.. వారి మీడియాలో హాస్యాస్పదమైన తప్పుడు సమాచారంతో మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేశారు. (ఇది) ప్రజల జీవితాలకు, మన రెండు దేశాలు, వ్యక్తుల మధ్య లోతైన సంబంధాల పరంగా చిక్కులు కలిగించకపోతే మరింత హాస్యాస్పదంగా ఉండేది’ అని అన్నారు.