అమెరికాకు చెందిన ఓ టెక్ కంపెనీ సహ-వ్యవస్థాపకుడు తన మాజీ సెక్రెటరీని సెక్స్ బానిసగా చేసి.. చిత్రహింసలకు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాన్-ఫ్రాన్సిస్కో సంస్థ ట్రేడ్‌షిఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు క్రిస్టియన్ లాంగ్.. తన వద్ద పనిచేసిన మహిళా ఉద్యోగిని సెక్స్ బానిసగా చేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజే ‘బానిస ఒప్పందం’పై బలవంతంగా సంతకం చేయించారని బాధితురాలు వ్యాజ్యం దాఖలు చేసింది. జేన్ డో అనే ఆమె.. లాంగ్ తనపై సంవత్సరాలపాటు అత్యాచారానికి పాల్పడి.. అత్యంత క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించింది. ఈ వ్యాజ్యంలో ఆ కంపెనీపై కూడా ఆరోపణలు చేసింది.
భౌతికంగా హింసించడం, మూత్ర విసర్జన చేయడం, పలు వస్తువులను ప్రయివేట్ భాగాల్లోకి చొప్పించడం సహా అత్యంత క్రూరమైన చర్యలకు లాంగ్ పాల్పడినట్టు పేర్కొంది. అటు, లాంగ్ దుష్ప్రవర్తన కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ఎగ్జిక్యూటివ్‌ని సీఈఓగా తొలగించిన తర్వాత ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అతడిపై తీవ్రమైన లైంగిక ఆరోపణల గురించి ఫిర్యాదులు రావడంతో యాజమాన్యం ఉద్వాసన పలికింది.
బాధితురాలు ఈ బానిస ఒప్పందం గురించి హెచ్ఆర్‌కు ఫిర్యాదు చేయగా.. 2020లో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దావాతో సమర్పించిన ఒప్పంద పత్రం ప్రకారం.. ‘తన యజమానికి సెక్స్ అవసరమైనప్పుడు అతని కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి.. కాలర్ ధరించనప్పుడు కూడా అతడితో సెక్స్‌కు నిరాకరించకూడదు.. ఆమె తన యజమానిని మొదటిసారిగా ప్రైవేట్‌గా చూసినప్పుడల్లా మోకాళ్లపై నిలబడి అతని కోసం ఏదైనా చేయగలదా అని అడగాలి.. ఒప్పందం ప్రకారం యజమాని విధించిన శిక్షను బానిస స్వీకరించాలి. అతడి పట్ల కోపం, నిరుత్సాహం లేదా విసుగు ప్రదర్శించకూడదు..
సరైన వస్త్రధారణతో పాటు బరువు కూడా 130-155 పౌండ్ల మధ్య ఉండాలి.. తన పురోగతిని వివరించే నివేదికను వారానికి ఒకసారి లాంగ్‌కి అందించాలి.. అన్ని విధాలుగా యజమానికి పూర్తిగా లొంగిపోవడానికి అంగీకరించాలి.. శిక్షకు గురికాకుండా యజమాని ఆదేశాన్ని పాటించడానికి ఎటువంటి పరిమితులు లేవు.. ఒప్పందంలోకి ప్రవేశించిన తర్వాత అందులోని మార్గదర్శకాలకు అనుగుణంగా శరీరంపై సర్వాధికారాలు యజమానికి చెందుతాయి..’ అని షరతుల్లో పేర్కొన్నారు.
బాధితురాలు మాట్లాడుతూ.. తాను ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నందున ట్రేడ్‌షిఫ్ట్‌లో వచ్చిన అవకాశాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతోనే ఒప్పందంపై సంతకం చేసినట్టు చెప్పారు. ఈ ఆరోపణలను మాత్రం లాంగ్ ఖండించడం గమనార్హం. ఏకాభిప్రాయంతో తమ మధ్య లైంగిక సంబంధం కొనసాగిందని అన్నారు. అటు, టెక్ సంస్థ మాత్రం ఈ ఆరోపణలపై స్పందించడానికి నిరాకరించింది.