చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి ఉన్న యువత ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాలనే సంకల్పంతో సీఎం జగన్ ఉన్నారు . అందుకు అనుగుణంగా ‘‘ఆడుదాం ఆంధ్రా’’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కీలకమైన ప్రతీ క్రీడాంశంలో భాగమైన భారత జట్టులో ‘వై నాట్ ఏపీ’ అనే స్థాయికి ఎదగాలంటే క్షేత్రస్థాయి నుంచే బలమైన పునాదులు పడాలన్న తలంపుతో ముందుకు సాగుతున్నారు. అంబటి రాయుడు, పీవీ సింధు, జ్యోతి సురేఖ, హనుమ విహారి, జ్యోతి యర్రాజీ, కోన శ్రీకర్ భరత్, సాత్విక్ సాయిరాజ్‌లా తాము తమకిష్టమైన స్పోర్ట్‌లో రాణించాలనుకునే వాళ్ల కోసమే ఈ క్రీడా సంబరాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా.. క్రికెట్, ఖో ఖో, బ్యాడ్మింటన్, కబడ్డీ, వాలీబాల్ వంటి ఐదు క్రీడాంశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోటీలు నిర్వహించనుంది. ఇందుకోసం ఇప్పటికే ముప్పై లక్షలకు పైగా మంది ఔత్సాహికులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నడిచే మెగా ఈవెంట్లో మండల, మున్సిపల్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకోసం.. క్రీడాకారులకు రూ. 41.43 కోట్ల విలువైన ఐదు లక్షల స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది కూడా!