ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగం పేరుతో పుట్టింటికే పరిమితమైన భార్య,,,‘వీకెండ్ భార్య’పై కోర్టుకెక్కిన భర్త..!

national |  Suryaa Desk  | Published : Sun, Dec 17, 2023, 08:27 PM

నెలలో రెండు వారాంతాల్లో తన భర్త ఇంటికి వెళ్లడం తన దాంపత్య బాధ్యతలను నెరవేర్చినట్లేనా లేదా అనే అంశాన్ని లేవనెత్తుతూ గుజరాత్‌కు చెందిన ఓ మహిళ హైకోర్టులో పిటిషన్ వేసింది. భార్య నెలలో కేవలం రెండు వారాంతాల్లోనే తన ఇంటికి వస్తోందని, ఆమె రోజూ తనతోనే ఉండేలా ఆదేశాలివ్వాలని దాంపత్య హక్కుల పునరుద్ధరణ కోసం హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం గతేడాది సూరత్‌ కుటుంబ న్యాయస్థానంలో ఆమె భర్త దావా వేశారు. దీంతో ఆ మహిళ ఈ నెల ప్రారంభంలో హైకోర్టును ఆశ్రయించింది. తన భార్య రోజూ నాతో ఉండటం లేదని, నెలలో రెండు వీకెండ్లు మాత్రమే తన దగ్గర ఉంటోందని భర్త పేర్కొన్నాడు. వివాహమైన కొన్నాళ్లకు కుమారుడు పుట్టినప్పటి నుంచి ఉద్యోగం సాకుతతో తన పుట్టింటిలోనే ఉండిపోతోందని తెలిపాడు. నెలలో రెండు, నాలుగో వారంతంలోనే నాతో గడపడానికి వస్తోందన్నారు. మిగతా రోజులు వాళ్ల అమ్మానాన్నల ఇంటికే పరిమితమవుతోందని వాపోయాడు. అంతేకాదు, ఉద్యోగంలో పడి తన కొడుకు ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవడం లేదని, తమ దాంపత్య హక్కులను కాపాడాలని కోరాడు.


దీనిపై విచారణ చేపట్టిన కుటుంబ న్యాయస్థానం.. సదరు మహిళకు నోటీసులు జారీచేసింది. దీంతో తన భర్త వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కౌంటర్ వేసింది. అంతేకాదు, అత్తింటికి ప్రతి నెలా రెండు వారాంతాల్లో క్రమం తప్పకుండా వెళ్తుంటానని, తాను విడిచిపెట్టాడని, కలిసి జీవించేలా ఆదేశాలు ఇవ్వాలని తన భర్త చేసిన వాదన తప్పు అని ఆమె అన్నారు. అయితే, భార్య అభ్యంతరాన్ని సెప్టెంబరు 25న కుటుంబ న్యాయస్థానం తోసిపుచ్చింది. దీనిపై పూర్తి స్థాయి విచారణ అవసరమని, విచారణకు ముందు దశలో సమస్యను పరిష్కరించలేమని చెప్పింది. దీంతో ఆమె గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ మహిళ తరఫున న్యాయవాది వాదిస్తూ.. ‘హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 9 ఒక వ్యక్తి తన జీవిత భాగస్వామి బాధ్యతల నుంచి వైదొలిగినట్లయితే వారు వైవాహిక బాధ్యతలను నెరవేర్చడానికి నిర్దేశించవచ్చు. ఈ సందర్భంలో భార్య ప్రతి రెండు, నాలుగో వారాంతంలో తన అత్తింటికి వెళ్తున్నారు. ఆమె దాంపత్య బాధ్యతల నుంచి వైదొలిగినట్లు భర్త చెప్పడం సమంజసం కాదు’ అని అన్నారు. దీనిపై స్పందించిన జస్టిస్ వీడీ నానావతి ‘భార్య తనతో ఉండమని భర్త కోరితే అందులో తప్పేముంది..దావా వేసే హక్కు ఆయనకు లేదా?’ అని ప్రశ్నించారు. ఈ సమస్యను పరిశీలించాల్సిన అవసరం ఉందని, జనవరి 25లోగా స్పందించాలని భర్తను ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com