పార్లమెంట్‌లో చోటు చేసుకున్న భద్రతా వైఫల్యాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే పార్లమెంటు ఆవరణలో జరిగిన సెక్యూరిటీ వైఫల్యం ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. అయితే ఇది తీవ్రమైన అంశమని పేర్కొన్న ప్రధాని మోదీ.. దీనిపై రాద్ధాంతం అనవసరమని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. అతి త్వరలోనే నిజానిజాలు, కుట్ర కోణాలు బయటికి వస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పార్లమెంటులో భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న ఘటన చాలా బాధించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ భద్రతా వైఫల్యాన్ని ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదని పేర్కొన్నారు. అయితే ఇలాంటి ఘటనపై అనవసరపు రాద్ధాంతం చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. దైనిక్ జాగరణ్ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా వాటి మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలని హితవు పలికారు. పార్లమెంటుపై జరిగిన దాడి ఘటనపై స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. ఆ దర్యాప్తుపై తమకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఈ కుట్రకు సంబంధించిన నిజాలు త్వరలోనే బయటపడతాయని ప్రధాని చెప్పారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా 3 రాష్ట్రాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలిచి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు కొత్త వారిని ముఖ్యమంత్రులుగా బీజేపీ అధిష్ఠానం అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే ఈ నిర్ణయంపై స్పందించిన ప్రధాని మోదీ.. 3 రాష్ట్రాలకు కొత్తవారని సీఎంలుగా ఎంపిక చేశారని.. చాలా మంది భావిస్తున్నారని.. అయితే నిజానికి వారు కొత్త వాళ్లేం కాదని ప్రధాని తెలిపారు. ఆ ముగ్గురు చాలా కాలంగా ప్రజల కోసం కష్టపడి పనిచేశారని.. వారికి ఎంతో అనుభవం ఉందని వెల్లడించారు. చాలా కాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయిందని.. ఈ నేపథ్యంలోనే కష్టపడి పనిచేసే వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదని.. ప్రతి రంగంలోనూ ఇలాంటి ఘటనలు జరుగుతాయని పేర్కొన్నారు.