గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు తమిళనాడు చిగురుటాకులా వణుకుతోంది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు, రైలు మార్గాలు జలమయ్యాయి. దాంతో ఎక్కడకక్కడ జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ నాలుగు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
తూత్తికూడి జిల్లాలోని శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్‌ను వర్షం నీరు చుట్టుముటింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోగా.. 500 మంది ప్రయాణికులు ఆ స్టేషన్‌లో చిక్కుకుపోయారు. మట్టి కోత కారణంగా శ్రీవైకుంటంలో రైల్వే ట్రాక్‌ల బ్యాలస్ట్ కొట్టుకుపోయింది. సిమెంట్ స్లాబ్‌లు మాత్రమే ఉన్న ఇనుప ట్రాక్‌లు ప్రమాదకరంగా వేలాడుతూ కనిపించాయి. స్టేషన్‌కు వెళ్లే మార్గం తెగిపోవడంతో సహాయక చర్యలను నిలిపివేశారు. అక్కడ నిలిచిపోయిన రైలు తిరుచెందూరు నుంచి చెన్నైకు వెళ్తోందని అధికారులు తెలిపారు.
‘ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకోవడానికి ప్రయత్నిస్తోంది.. హెలికాప్టర్ ద్వారా ఆహారం అందజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని దక్షిణ రైల్వే చీఫ్ పీఆర్వో గుహనేశన్ తెలిపారు. వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని విడుదల చేయడంతో తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి భారీగా వరద చేరి లోతట్టు నీట మునిగాయి. అటు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను స్టాలిన్ ఆదేశించారు. ఇదే సమయంలో వరద పరిస్థితిపై చర్చించడానికి డిసెంబరు 19న అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు.
కన్యాకుమారి, తూత్తుకూడి, తిరునాల్వేలి, తెన్కాసి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకూడిలోని కాయల్‌పట్టణంలో గడచిన 24 గంటల్లో అత్యధికంగా 95 సెం.మీ. వర్షం కురిసింది. సహాయక చర్యలకు భారీస్థాయిలో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలను మోహరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. డిసెంబరు మొదటి వారంలో మిచౌంగ్ తుఫాను తమిళనాడుపై విరుచుకుపడింది. దాని నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. తూత్తుకుడిలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని విమానాలను దారి మళ్లించారు. మరికొన్ని సర్వీసులను రద్దు చేశారు. మరోవైపు, వచ్చే 48 గంటల పాటు దక్షిణ తమిళనాడుకు ఐఎండీ భారీ వర్ష సూచన చేసింది.