కశ్మీర్ లోయను సోమవారం మధ్యాహ్నం నుంచి వరుసగా రెండు భూకంపాలు వణికించాయి. తొలుత మధ్యాహ్నం 3.48 గంటలకు భూకంపం చోటుచేసుకుంది. ఇది రిక్టర్ స్కేల్‌పై 5.5 తీవ్రతగా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లోని కార్గిల్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు పేర్కొంది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. భూకంపం కారణంగా భయాందోళనలకు గురైన స్థానికులు.. ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
అనంతరం కొద్ది నిమిషాల వ్యవధిలోనే కిష్టావర్‌లోనూ రెండో భూకంపం సంభవించినట్టు ఎన్‌సీఎస్ పేర్కొంది. కశ్మీర్ సరిహద్దుల్లోని కిష్టావర్‌లో 16 కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు తెలిపింది. సాయంత్రం 4.18 గంటలకు ఈ భూకంపం సంభవించినట్టు పేర్కొంది. అయితే, భూకంప నష్టం గురించి తక్షణమే ఎటువంటి సమాచారం తెలియరాలేదని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, ఇటీవల కాలంలో ఉత్తర భారతదేశం, హిమాలయాల ప్రాంతం, నేపాల్‌లపై తరచూ ప్రకృతి ప్రకోపం చూపిస్తూనే ఉంది. ఇక సాధారణంగా భూ ప్రకంపనలు అయితే చాలా సార్లు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి భారీ తీవ్రతతో వచ్చిన భూకంపాలు ఆస్తి, ప్రాణ నష్టాన్నే మిగులుస్తున్నాయి. గత నెల ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం చోటు చేసుకుంది. తాజాగా నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం ధాటికి ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తీవ్ర ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతం నుంచి ఈశాన్య భారత మధ్య హిమాలయ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. భారత్- నేపాల్‌లో ఉన్న ఈ భాగం రెండు భారీ టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దులో (ఫాల్ట్ జోన్లు) ఉంది. దీంతో ఈ ప్రాంతాల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.