దేశంలో డ్రైవర్ లెస్ కార్లను ప్రవేశపెట్టేది లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడే కాదు డ్రైవర్ లేకుండా నడిచే కార్లు ఎప్పటికీ భారత్‌లో తిరగవని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలోని ఐఐఎం నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రోడ్డు భద్రతా సమస్యలపై ప్రసంగించిన నితిన్ గడ్కరీ.. డ్రైవర్ లెస్ కార్ల గురించి కీలక విషయాలను వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం పని చేస్తున్న డ్రైవర్ల ఉద్యోగాల భద్రత దృష్ట్యా డ్రైవర్ లెస్ కార్లను భారత్‌లోకి ఎప్పటికీ అనుమతించేది లేదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
మరోవైపు.. దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కూడా నితిన్ గడ్కరీ మాట్లాడారు. కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటు, రోడ్లపై బ్లాక్ స్పాట్‌లను తొలగింపు వంటి చర్యలతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించినట్లు కేంద్రమంత్రి తెలిపారు. ప్రజా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ చెప్పారు. ఇక భవిష్యత్తు ఇంధనం అంతా హైడ్రోజనే అని నితిన్ గడ్కరీ అభివర్ణించారు.
ఇటీవల పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మాట్లాడిన నితిన్ గడ్కరీ.. జాతీయ రహదారులపై మూలధన వ్యయం 2013-14 లో రూ.51 వేల కోట్లు ఉండగా.. అది 2022-23 నాటికి రూ.2.40 లక్షల కోట్లకు పెరిగిందని గణాంకాలతో సహా వివరించారు. 2013-14 లో రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు బడ్జెట్ కేటాయింపులు రూ.31,130 కోట్లు కాగా.. 2023-24 నాటికి అది రూ.2,70,435 కోట్లకు పెరిగిందని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.