‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరులో విద్యార్థి సాధికారత ర్యాలీ నిర్వహించారు. వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నిర్వహించిన ఈ ర్యాలీలో నగరంలోని పలు కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల దినేష్ రెడ్డి నేతృత్వంలో ఏలూరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ హాజరయ్యారు. తొలుత ఏలూరు జెడ్పీ కార్యాలయ ప్రాంతం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్దకు ర్యాలీగా వచ్చారు. అక్కడ దివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్, కోర్టు సెంటర్, ఏలూరు జీజీహెచ్ మీదుగా రామచంద్రరావుపేట వరకు ర్యాలీ నిర్వహించారు.