ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జ్ఞానవాపీ మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

national |  Suryaa Desk  | Published : Tue, Dec 19, 2023, 11:27 PM

జ్ఞానవాపీ ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన సివిల్ దావాలను సవాల్ చేస్తూ మసీదు కమిటీ వేసిన అన్ని పిటిషన్లను అలహాబాద్ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. 1991లో దాఖలైన ఈ సివిల్ దావాలలో ఒకదానిపై ఆరు నెలల్లోగా విచారణ పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం పక్కన ఉన్న జ్ఞానవాపీ మసీదును హిందూ ఆలయం కూల్చి నిర్మించారనేది హిందూ సంఘాల వాదన. దీనిపై న్యాయస్థానంలో వాజ్యాలు దాఖలు కాగా.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో ఇటీవలే ఏఎస్ఐ శాస్త్రీయ సర్వేను పూర్తిచేసి నివేదికను సమర్పించింది.


కాగా, జ్ఞానవాపి మసీదు కమిటీకి చెందిన మూడు, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు చెందిన రెండు పిటిషన్ల కలిపి మొత్తం ఐదింటిని హైకోర్టు విచారించింది. వీటిలో మూడు పిటిషన్లు 1991లో వారణాసి కోర్టులో దాఖలైన దావాను సవాల్ చేశాయి. మసీదు ప్రాంగణంలోని వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించి, దేవతా విగ్రహాల ఆరాధనకు అనుమతించాలని ఆది విశ్వేశ్వర విరాజ్‌మన్ అనే భక్తుడు వారణాసి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ వ్యాజ్యాన్ని అంజుమన్ ఇంతేజమియా మసీదు కమిటీ, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సవాల్ చేశాయి. ప్రార్థనా స్థలాల చట్టం 1991 ప్రకారం.. పిటిషన్ విచారణకు అర్హతలేదని వాదించాయి. అయితే, జ్ఞానవాపి వివాదం స్వాతంత్య్రానికి ముందు నుంచే ఉందని హిందూ సంఘాలు వాదించాయి. తాజాగా, ఈ వాదనలతో జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ఏకీభవించారు. ఈ దావా నిర్వహించదగినదని, ప్రార్థనా స్థలాల చట్టం 1991 దీనికి వర్తించదన్నారు. పిటిషనర్లు, ప్రతివాదుల లాయర్లు వాదనలు విన్న తర్వాత జస్టిస్ అగర్వాల్ డిసెంబర్ 8న తన తీర్పును రిజర్వ్ చేశారు. మంగళవారం తీర్పును వెలువరించారు.


మసీదు ప్రాంగణం ముస్లిం లేదా హిందువులతో సంబంధం కలిగి ఉండొచ్చు, కానీ, అంశాలను తొలి దశలోనే నిర్ణయించలేమని కోర్టు పేర్కొంది. ‘ఈ దావా దేశంలోని రెండు ప్రధాన వర్గాలపై ప్రభావం చూపుతుంది... 6 నెలల్లో ఈ వ్యాజ్యాన్ని త్వరగా పరిష్కరించాలని మేము ట్రయల్ కోర్టును ఆదేశించాం’ అని తీర్పులో స్పష్టం చేసింది. జ్ఞానవాపీ మసీదు లోపల ఉన్న శృంగార గౌరి, కుబేర్‌నాథ్ తదితర దేవతా విగ్రహాలకు నిత్యం పూజలు చేసేలా అనుమతించాలని కోరుతూ ఐదుగురు హిందూ మహిళలు రెండున్నరేళ్ల కిందట వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. వీటిని మసీదు కమిటీ సవాల్ చేయగా.. కోర్టు తిరస్కరించింది. శాస్త్రీయ సర్వేకు అనుమతించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com