శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ రోజు రోజుకూ భారీగా పెరుగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప దర్శనం కోసం వచ్చే వారితో శబరి గిరులు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే అయ్యప్పను దర్శించుకునే వారితో క్యూ లైన్లు కిలోమీటర్ల మేర పెరిగిపోతున్నాయి. దీంతో అయ్యప్పను దర్శించుకునేందుకు 16 గంటలకు పైగా సమయం పడుతోందని భక్తులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అయ్యప్ప దర్శనానికి వెళ్తున్న భక్తులను మార్గమాధ్యలోనే పోలీసులు గంటల తరబడి నిలిపివేస్తున్నారు. మరోవైపు.. భక్తులను అదుపు చేయలేక పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు, కేరళ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంబ నుంచి శబరిమల వరకు అయ్యప్ప భక్తులతో భారీ క్యూ లైన్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భక్తులను అధికారులు మధ్యలోనే నిలిపి వేస్తున్నారు. అయ్యప్ప సన్నిధానంలో భక్తుల రద్దీని నియంత్రించేందుకే ఇలా మధ్యలోనే ఆపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక భక్తుల రద్దీని నియంత్రించే క్రమంలో పోలీసులు ఇప్పటికే వారిపై పలుమార్లు లాఠీఛార్జ్ చేశారు. దీంతో కేరళ ప్రభుత్వంపై.. పోలీసులపై అయ్యప్ప భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మరోవైపు.. అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు మొత్తం నిండిపోయాయి. స్వామి దర్శనం కోసం దాదాపు 16 గంటలకు పైగా సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు. భారీగా అయ్యప్ప దర్శనం కోసం వస్తున్న భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ బోర్డు, కేరళ ప్రభుత్వం విఫలం అయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తీరుపై అయ్యప్ప భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10 గంటలకు పైగా భక్తులు మార్గ మధ్యలోనే నిలబడి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 2 కిలో మీటర్లకు పైగా క్యూ లైన్లు వేచి ఉన్నట్లు భక్తులు పేర్కొన్నారు. భారీ క్యూలైన్ల కారణంగా వృద్దులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇటీవల శబరిమలలో తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత కూడా కేరళ ప్రభుత్వం, ట్రావెన్స్ కోర్ దేవస్థానం బోర్డు తీరు మారలేదని తెలిపారు. అధికారులు, పోలీసుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అయ్యప్ప భక్తులు ఆరోపిస్తున్నారు.