అత్యాచారం తీవ్రమైన నేరమని గుజరాత్ హైకోర్టు వ్యాఖ్యానించింది. అది ఎవరు చేసినా చివరికి భార్యపై భర్త చేసినా అది అత్యాచారమే అవుతుందని ఈ సందర్భంగా గుజరాత్ హైకోర్టు పేర్కొంది. చాలా దేశాల్లో పెళ్లి తర్వాత భార్యకు ఇష్టం లేకుండా బలవంతంగా శృంగారం చేసినా అది అత్యాచారం కిందికే వస్తుందని గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దివ్యేష్ జోషి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వైవాహిక అత్యాచారం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుందని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేసింది. డిసెంబర్ 8 వ తేదీన ఒక కేసులో జస్టిస్ జోషి ఒక మహిళ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించారు. ఆ మహిళ తన కోడలిపై లైంగిక వేధింపులకు పాల్పడేలా తన కొడుకును ప్రేరేపించిందనే ఆరోపణలతో అరెస్ట్ అయింది. అయితే తనకు బెయిల్ ఇవ్వాలని మహిళ చేసిన విజ్ఞప్తిని కోర్టు కొట్టి వేసింది. దీంతో తాజాగా విచారణ సందర్భంగా జస్టిస్ దివ్యేష్ జోషి ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత రాజ్యాంగం స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించిందని జస్టిస్ దివ్యేష్ జోషి తెలిపారు. ఇక పెళ్లి బంధం కూడా ఇద్దరికీ సమానమేనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే రేప్ అంటే రేప్ అని.. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌లో మహిళలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు.. వెల్లడైన గణాంకాల కంటే చాలా ఎక్కువగా ఉంటాయని జస్టిస్ దివ్యేష్ జోషి తెలిపారు. కోడలిపై బావ, కొడుకు కలిసి అత్యాచారం చేశారని.. డబ్బు సంపాదించాలనే అత్యాశతో బాధితురాలిని నగ్నంగా చేసి వీడియోలు తీసి పోర్న్ సైట్‌లో అప్‌లోడ్ చేశారని కోర్టు పేర్కొంది. ఇలాంటి చట్ట విరుద్ధమైన, అవమానకరమైన చర్య గురించి అత్తగారికి తెలుసునని.. తన భర్త, కొడుకు చేసిన అలాంటి చర్యను ఆపకుండా నేరంలో ఆమె కూడా పాల్గొనకపోయినా సమాన పాత్ర పోషించిందని కోర్టు గుర్తించింది. దీంతో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇక అమెరికాలోని 50 రాష్ట్రాలతోపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, కెనడా, ఇజ్రాయెల్, స్వీడన్, డెన్మార్క్, పోలాండ్, చెకోస్లోవేకియా, నార్వే, సోవియట్ యూనియన్ సహా పలు దేశాల్లో వైవాహిక అత్యాచారం చట్టవిరుద్ధమని డిసెంబర్ 8 వ తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల్లో జస్టిస్ దివ్యేష్ జోషి పేర్కొన్నారు. భర్తలకు ఇచ్చే మినహాయింపును బ్రిటన్ కూడా రద్దు చేసినట్లు గుర్తు చేశారు.