సాధువులకు అద్భుతమైన శక్తులు ఉంటాయని.. వారు నోటి వెంట వచ్చిన మాటలు నిజమవుతాయని నమ్ముతారు. అయితే, ఈ సాధువుకు అద్భుత శక్తో లేక మరికెందో తెలియదు కానీ..50 ఏళ్లుగా ఎత్తిన చేయి దించలేదు. కాసేపు చేయి ఎత్తితేనే నొప్పికి తట్టుకోలేక దింపేస్తాం. అలాంటి ఆ సాధువు ఐదు దశాబ్దాల నుంచి అలానే ఎత్తిన చెయ్యి దించకుండా అలాగే ఉంచారు. 1973లో కుడి చెయ్యి ఎత్తిన ఆ సాధువు.. 50 ఏళ్లు అయినా ఇప్పటికీ కిందకు దింపకపోవడం విశేషం. ఆయనే సాధువు అమర భారతి. పబ్లిసిటీకి దూరంగా ఉంటారు కాబట్టే ఆయన గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు.
కానీ, ప్రపంచంలో శాంతి నెలకొనాలన్న గొప్ప ఆశయం కోసమే ఆ సాధువు చెయ్యి ఎత్తారు. మహోన్నత లక్ష్యం కోసం తాను చెయ్యి ఎత్తుతున్నాననీ ఇక దాన్ని దింపేది లేదని ఆయన శపథం చేశారు. తాను చెయ్యి దింపను కాబట్టి… శాంతి నెలకొనేలా చెయ్యాలని ఆ పరమేశ్వరుడ్ని కోరుకున్నారట. సాధారణంగా చాలా పనులను కుడిచేతితోనే చేస్తాం. మరి అమర భారతి స్వామిజీ తన కుడి చెయ్యి దింపరు కాబట్టి ఆ పనులు చేసుకోవడం ఇబ్బందే. మరో మాటలో చెప్పాలంటే ఆ చెయ్యి ఉన్నా లేనట్టే. కాగా, ఒకప్పుడు బ్యాంకు ఉద్యోగం చేస్తూ.. అందరిలాగే భార్యా పిల్లలతో ఉన్నారు. కానీ, ఓ రోజు ఏం జరిగిందో తెలియదు గానీ, హఠాత్తుగా తాను సన్యాసిగా మారుతున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేశారు. అప్పటి నుంచి తన జీవితాన్ని ఆ శివుడికే అకింతమిచ్చారు. అ సమయంలోనే ఏదైనా అసాధ్యమైందని చేసి.. ఆ పరమేశ్వరుడికి సమర్పించుకోవాలని భావించారట. అందుకు తన కుడిచేతిని ఎత్తి అలాగే ఉంచాలని అనిపించిందట. తనకు అంతకు ముందెప్పుడూ ఇలాంటి ఆలోచన లేదనీ… అదంతా దైవ సంకల్పం అని ఆయన అంటున్నారు.
కుడి చేతిని ఎత్తి ఉంచగలగడం వెనుక కూడా దైవ మహిమే ఉందని ఆయన చెబుతారు. మొదట్లో రకరకాల నొప్పులను వేధించాయి. కీళ్లనొప్పులు బాధించాయి. కాలం గడిచేకొద్దీ ఇక ఆ చెయ్యి అలా ఉండిపోయింది. అలా ప్రపంచ శాంతి కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేస్తున్నారు. గోరంత చేస్తే కొండంత చేసినట్టు బిల్డప్పు ఇచ్చుకునే కొందరి స్వామీజీలకు భిన్నంగా ఈ సాధువు పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. అందుకే, ఈ భూమిపై ఆయనో ప్రత్యేకమైన సాధువుగా నిలిచారు. ప్రపంచ శాంతి కోసం ఆయన ఉక్కు సంకల్పం చేశారు.