వాహనాలు రోడ్డు ఎక్కుతున్నాయంటే చాలు.. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించేవారిని ట్రాఫిక్ పోలీసులు నిఘా వేసి మరీ పట్టుకుంటారు. తమ వద్ద ఉన్న కెమెరాలతో నెంబర్ ప్లేట్లను క్లిక్‌మనిపించి చలాన్లు వేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వాహనదారులు కూడా ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఏకంగా 255 సార్లు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. దీంతో అతడి స్కూటీపై భారీగా జరిమానా విధించారు. ఎంతలా అంటే ఆ స్కూటీ మీద ఉన్న ట్రాఫిక్ చలాన్ల మొత్తం చూసి పోలీసులే నోరెళ్ల బెట్టారు. ఎందుకంటే 255 చలాన్లకు మొత్తంగా రూ.1.34 లక్షల ఫైన్లు వేశారు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది.
బెంగళూరుకు చెందిన ఎలుమలై అనే వ్యక్తి పేరు మీద ఉన్న స్కూటీ గత రెండేళ్ల నుంచి 255 సార్లు ట్రాఫిక్ రూల్స్‌ని ఉల్లంఘించింది. ఇందుకు ఆ వ్యక్తికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రూ.1.34 లక్షల జరిమానా విధించారు. అయితే ఇటీవల పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల లెక్క తీసిన బెంగళూరు ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్.. ఈ వ్యక్తిపై నమోదైన చలాన్లను చూసి ఖంగుతిన్నారు. దీంతో వెంటనే బకాయిలు చెల్లించాలని ఎలుమలైకి నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనతో అలర్ట్ అయిన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సెంటర్ వెంటనే బెంగళూరులోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం అందించారు. ఇలాంటి వాహనాలను గుర్తించి.. పేరుకుపోయిన జరిమానాలను వసూలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఘటనపై సమాచారం అందిన తర్వాత బెంగళూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఎలుమలై ఒక రోజూ వారీ కూలీ అని గుర్తుంచారు. అయితే ఎలుమలై పేరుతో రిజిస్టర్ అయిన స్కూటర్‌పై 255 ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని స్టేషన్‌కు పిలిపించి విషయం చెప్పారు. అయితే ఆ విషయం విని ఎలుమలై షాక్ అయ్యాడు. అయితే బెంగళూరు నగరంలో ఏర్పాటు చేసిన ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కెమెరాల గురించి తనకు తెలియదని చెప్పాడు. అయితే తాను చాలా తక్కువగా స్కూటీని వినియోగిస్తానని.. కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్న తన కొడుకు కోసం స్కూటీ కొన్నట్లు తెలిపాడు. అయితే ఆ స్కూటీని ఎలుమలైతో పాటు అతని కుమారుడు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరూ చాలాసార్లు హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపినట్లు ఫోటోల్లో కనిపించింది. అయితే రూ.10 వేలు జరిమానా కట్టిన ఎలుమలై.. 20 ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేశాడు. 50 లేదా అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ వెల్లడించింది. దీనికోసం బెంగళూరులో ఒక ప్రత్యేకమైన డ్రైవ్‌ను కూడా ప్రారంభించినట్లు తెలిపింది.