గతవారం లోక్‌సభలో చోటుచేసుకున్న చొరబాటు ఘటన పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతూ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయి. దీంతో ప్రతిపక్షాలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ సమావేశాల పూర్తయ్యే వరకూ ఇది అమల్లో ఉంటుందని వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకూ సస్పెన్షన్‌కు గురైన ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 141కి చేరింది. పార్లమెంట్ చరిత్రలోనే ఇంత పెద్ద సంఖ్యలో ఎంపీలను సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి.
స్పీకర్ ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీర్మానం ప్రవేశపెట్టగా.. మూజువాణీ ఓటుతో లోక్‌సభ దీనిని ఆమోదించింది. అనంతరం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. ఎంపీలను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. వీరిలో కాంగ్రెస్ ఎంపీలు శశి థరూర్, కార్తి చిదంబరం, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, ఫరూక్ అబ్దుల్లా, డింపుల్ యాదవ్, మనీశ్ తివారీ తదితరులు ఉన్నారు. దీనిపై ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ‘సభలోకి ప్లకార్డులు తీసుకురాకూడదనే నిబంధన ఉంది.. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో ఓటమితో వారు (విపక్షాలనుద్దేశిస్తూ) నిరాశ చెందారు. అందుకే ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడుతున్నారు’ అని ధ్వజమెత్తారు.
సోమవారం ఏకంగా 78 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. లోక్‌సభలో గతవారం 13 మంది, సోమవారం మరో 33 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. తాజా సంఖ్యతో కలిపి ఇప్పటి వరకు లోక్‌సభలో 95 మందిపై వేటు పడినట్టయ్యింది. మరోవైపు, రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకున్నట్లైంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబరు 22తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదించుకోవడానికి అధికార పక్షం కుట్రపూరితంగా తమ ఎంపీలను సస్పెండ్ చేసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పాలక పక్షం మాత్రం ఇది తీవ్రమైన అంశమే కానీ, దీనిపై పార్లమెంట్‌లో చర్చ అవసరం లేదని చెబుతోంది.