అది 2020 జూన్. సరిహద్దుల్లో భారత భూభాగాన్ని రక్షించేందుకు భారత సైన్యం అనుక్షణం రెప్ప మూయకుండా కాపాడుతోంది. అయితే గల్వాన్ లోయలో చైనా సైనికులు చొచ్చుకురావడంతో భారత సైనికులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య భీకర పోరు సాగింది. ఈ ఘర్షణలో ఇరు వైపులా ప్రాణ నష్టం చోటు చేసుకుంది. అయితే భారత సైనికులతో పోల్చితే చైనా వైపు భారీగానే ప్రాణ నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ఘటనతో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ సమయంలో అప్పటి ఆర్మీ చీఫ్ ఎం ఎం నరవణేకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఇంతకీ ఆ ఫోన్ కాల్ సంభాషణలో.. భారత్, చైనా మధ్య చోటు చేసుకున్న పరిస్థితుల వేళ.. రాజ్‌నాథ్ సింగ్.. ఆర్మీ చీఫ్‌కు ఏం ఆదేశాలు ఇచ్చారు అనేది తాజాగా వెలుగులోకి వచ్చింది.
మూడేళ్ల క్రితం భారత్ చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణెకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు జనరల్ ఎం.ఎం.నరవణె తాను రాసిన పుస్తకంలో వివరించారు. భారత్, చైనా మధ్య యుద్ధం అంచులకు వెళ్లిన ఆనాటి పరిస్థితులకు సంబంధించిన వివరాలను ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకంలో జనరల్ ఎం ఎం నరవణె పేర్కొన్నారు. ఈ పుస్తకం త్వరలో అందుబాటులోకి రానుంది. ఆ ఉద్రిక్తతల సమయంలో జనరల్ ఎంఎం నరవణె, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రితోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోభాల్ మధ్య కీలక సంభాషణ జరిగింది. అయితే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండని పూర్తి స్వేచ్ఛను కల్పిస్తూ రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలు ఇచ్చారని ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో జనరల్ నరవణె పేర్కొన్నారు.
గల్వాన్ ఘర్షణ తర్వాత తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో 2020 ఆగస్టు నెలలో మరో కీలక పరిణామం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంట ఉన్న రెకిన్ లా పర్వత ప్రాంతాల్లో చైనా తన యుద్ధ ట్యాంకులు, సైనిక బలగాలను మోహరించడం మొదలుపెట్టింది. అయితే సరిహద్దులకు చేరుకోవడం భారత బలగాలకు మరింత క్లిష్లంగా మారింది. ఇదే విషయాన్ని రక్షణ శాఖకు ఇండియన్ ఆర్మీ వివరించింది. దీంతో అలర్ట్ అయిన కేంద్రం వివిధ శాఖల అధిపతులతో మాట్లాడింది. ఈ క్రమంలోనే 2020 ఆగస్టు 31 వ తేదీ రాత్రి.. రక్షణశాఖ మంత్రి, విదేశాంగ మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌ల మధ్య ఫోన్ కాల్స్ సంభాషణలను ఆ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలను జనరల్ నరవణె తన పుస్తకంలో గుర్తు చేసుకున్నారు.
కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేయగానే తన మనసులో ఎన్నో రకాల ఆలోచనలు వచ్చాయని జనరల్ నరవణె తెలిపారు. అక్కడి పరిస్థితి తీవ్రతను తాను రాజ్‌నాథ్‌కు చెప్పారని పేర్కొన్నారు. రాత్రి 11.30 లోపు ప్రధాని మోదీతో మాట్లాడి మళ్లీ కాల్ చేస్తానని రాజ్‌నాథ్ చెప్పారని తెలిపారు. ఆ తర్వాత ఫోన్ చేసి అది పూర్తిగా సైనికుల నిర్ణయమని.. సైన్యానికి ఏది మంచిది అని అనిపిస్తే అది చేయండని సూచించినట్లు వెల్లడించారు. అప్పుడు బాధ్యత మొత్తం తనపైనే పడిందని.. కొన్ని నిమిషాల పాటు అలాగే మౌనంగా కూర్చున్నట్లు జనరల్ నరవణె వివరించారు.
ఆ తర్వాత తూర్పు కమాండ్ ఉన్నతాధికారులతో ఆర్మీ హౌస్ అన్ని మ్యాప్‌లను పరిశీలించి.. అన్ని రకాలుగా సిద్ధమైనట్లు చెప్పారు. అయితే ఆ సమయంలో నిజంగా యుద్ధం ప్రారంభించాలా అనే ప్రశ్న వచ్చిందని పేర్కొన్నారు. ఒకవైపు కొవిడ్.. మరోవైపు దేశ ఆర్థిక పరిస్థితి.. వస్తు సరఫరా వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిస్థితులు నెలకొన్నాయని.. అలాంటి సమయంలో యుద్ధం మొదలుపెడితే భారత్‌కు అంతర్జాతీయంగా మద్దతుగా లభిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తినట్లు చెప్పారు. అదే సమయంలో చైనా, పాకిస్థాన్‌లు కలిస్తే ఎలాంటి ఆపద ఎదురవుతుంది అనే వందల ప్రశ్నలు ఆ రోజు రాత్రి తన మనసులోకి వచ్చినట్లు జనరల్ నరవణె పుస్తకంలో రాశారు.