సీఎం జగన్ పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నేడు అయన మాట్లాడుతూ.... సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో మూడేళ్లలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పి తొలిసారి శిలాఫలకం వేసి నేటికి నాలుగేళ్లయిందన్నారు. రూ.15వేలకోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టి పాతికవేలమందికి ఉద్యోగాలిస్తానంటూ ఆనాడు కోతలు కోశాడన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్లాంట్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా, కనీసం తుప్పలు తొలగించేందుకు సైతం నిధులు కేటాయించకపోవడంతో తొలుత ఒప్పందం చేసుకున్న లిబర్టీ స్టీల్స్ పరారైపోయిందని అన్నారు. దీంతో జేఎస్డబ్ల్యు అనే మరో కంపెనీని బతిమాలుకొని ఏడాది క్రితం మరోమారు శంకుస్థాపన చేశాడన్నారు. మరో మూడు నెలల్లో పదవీ కాలం పూర్తి కావస్తున్నా కడప స్టీల్ ప్లాంట్ పనులు అంగుళం కూడా ముందుకు సాగలేదన్నారు.