అమెరికాలో మరోసారి ఖలీస్థానీ వేర్పాటువాదులు వీరంగానికి పాల్పడ్డారు. ప్రముఖ హిందూ దేవాలయంలో భారత్ వ్యతిరేక నినాదాలు రాసి.. విధ్వంసం సృష్టించారు. కాలిఫోర్నియా రాష్ట్రం నెవార్క్ స్వామినారాయణ్ మందిర్ వాసన సంస్థాన్ ఈ ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆలయ గోడలపై భారత్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాసినట్టు ఫోటోల్లో కనిపిస్తోంది. ఆలయానికి వచ్చేవారిలో భయాన్ని సృష్టించడానికి ఇటువంటి చర్యలకు పాల్పడినట్టు ఆ సంస్థ మండిపడింది. నెవార్క్ పోలీసులు, జస్టిస్ సివిల్ రైట్స్ విభాగం కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టాయి.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్.. చర్యలను ఖండించింది. ‘కాలిఫోర్నియా నెవార్క్‌లోని ఎస్‌ఎంవీఎస్ శ్రీ స్వామినారాయణ్ మందిరంలో భారత వ్యతిరేక నినాదాలు రాసి.. విధ్వంసానికి పాల్పడిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఈ ఘటన భారతీయ సమాజం మనోభావాలను దెబ్బతీసింది.. దీనిపై అమెరికా అధికార వర్గాలు తక్షణమే దర్యాప్తు చేపట్టి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’ అని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. అయితే, అమెరికా, కెనడాలోని హిందూ దేవాలయాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఖలిస్థాన్ మద్దతుదారుల కార్యకలాపాలను తీవ్రతరం చేయడంపై భారత్ ఇంతకుముందు ఆందోళన వ్యక్తం చేసింది. వివిధ దేశాలలో వేర్పాటువాద ఉద్యమాన్ని ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలు, వ్యక్తులను అరికట్టింది.
ఆగస్టులో కెనడాలోని సర్రేలోని ఒక దేవాలయాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. బ్రిటిష్ కొలంబియాలోని పురాతన దేవాలయాలలో ఒకటైన సర్రేలోని లక్ష్మీ నారాయణ్ మందిర్ గోడలు, గేటుపై ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు అతికించారు. ఉగ్రవాది హర్‌దీప్ నిజ్జార్ హత్యలో భారత్ పాత్రపై కెనడా దర్యాప్తు చేపట్టాలని పోస్టర్లలో డిమాండ్ చేశారు. కాగా, నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల పాత్ర ఉందని ఆరోపణలు చేసిన కెనడా.. ఇంత వరకూ ఎటువంటి ఆధారాలను బయటపెట్టలేదు. ఇదే సమయంలో ఖలీస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్యకు కుట్రపన్నారని ఆరోపిస్తూ ఓ భారతీయుడ్ని అమెరికా అదుపులోకి తీసుకుంది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన భారత్.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు సమర్పిస్తే దర్యాప్తు చేపడతామని స్పష్టం చేసింది.