గుజరాత్ రాష్ట్రం ఆవిర్బావం నుంచి అక్కడ మద్యపాన నిషేధం అమల్లో ఉంది. మహారాష్ట్రలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలనూ వేరుచేసి 1960 మే 1న గుజరాత్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తున్నారు. అయితే, ఆరు దశాబ్దాల తర్వాత ఈ నిబంధనను గుజరాత్ ప్రభుత్వం బ్రేక్ చేసింది. గాంధీనగర్‌లోని మొట్టమొదటి దేశీయ ఆర్థిక సేవల కేంద్రం గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్)లో మద్యం సేవించేందుకు బీజేపీ సర్కారు అనుమతించింది. పన్నురహిత ఆర్థిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన గిఫ్ట్ సిటీ.. ఆర్థిక ప్రోత్సాహకాలు, మరింత సౌకర్యవంతమైన నియంత్రణ వాతావరణాన్ని అందించడం ద్వారా సింగపూర్ వంటి అంతర్జాతీయ హబ్‌లతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో మద్యపాన సేవనంపై పరిమితులను సడలించే నిర్ణయం వెనుక ఆధునిక యుగంలో ఆర్థిక సేవలు, సాంకేతిక కేంద్రంగా రూపొందించే వ్యూహంలో భాగం. సంప్రదాయ ఆర్థిక సేవలకు మించిన హబ్‌గా ఇది అభివృద్ధి చెందుతోంది. భవిష్యత్తు కోసం దాని దృష్టిలో ఆవిష్కరణ, స్థిరత్వాన్ని స్వీకరించింది.
ప్రభుత్వ విజన్‌కు అనుగుణంగా 'వైన్ అండ్ డైన్'కి నిబంధనలు నడలించినట్టు నార్కోటిక్స్ అండ్ ఎక్సైజ్ విభాగం తెలిపింది. ‘అంతర్జాతీయ పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు ప్రపంచస్థాయి అనుకూల వ్యాపార వ్యవస్థను అందించడానికి గిఫ్ట్ సిటీ ప్రాంతంలో వైన్ అండ్ డైన్ సౌకర్యాలను అనుమతించేలా మద్య నిషేధ నిబంధనలను మార్చడానికి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం’ అని ప్రకటించింది. ‘గిఫ్ట్ సిటీలో పనిచేసే వ్యక్తులందరికీ మద్యం యాక్సెస్ పర్మిట్, సేవనానికి అనుమతిస్తాం.. ప్రతి కంపెనీ అథరైజ్డ్ విజిటర్స్‌కు తమ శాశ్వత ఉద్యోగుల సమక్షంలో తాత్కాలిక అనుమతులు కలిగిన హోటళ్లు, రెస్టారెంట్లు లేదా క్లబ్‌లలో మద్యం సేవించేందుకు అనుమతించే నిబంధన కూడా రూపొందించాం’ అని పేర్కొన్నారు.