మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి భార్య షబానాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్రమ కేసు బనాయించి.. తనను కూడా జైలుకు పంపేందుకు కుట్ర పన్నుతున్నారని షబానా ఆరోపించారు. ఎవరూ లేని సమయంలో తమ ఇంటి గోడకు పోలీసులు నోటీసు అతికించడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. కడప జిల్లా పులివెందులలో.. సీఆర్‌పీసీ సెక్షన్ 41(ఏ)(1) ప్రకారం విచారణకు హాజరు కావాలని, ఉల్లంఘిస్తే అరెస్టు చేస్తామని నోటీసులో ఉందన్నారు. ఏ కేసుకు సంబంధించి నోటీసు ఇస్తున్నారో పోలీసులు చెప్పకపోవడంపై షబానా అభ్యంతరం తెలిపారు. రిమాండులో ఉన్న తన భర్త దస్తగిరికి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నానని.. దీన్ని గ్రహించి ప్రత్యర్థులు తనను కూడా జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలే తమ ఇంటిపైకి దాడికి వచ్చారని, దీనిపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోకుండా, అధికార పార్టీ ప్రలోభాలకు లొంగి ఈ ఏడాది జులైలో దస్తగిరితో పాటు తనపై కూడా అక్రమంగా కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు నోటీసు ఇవ్వడం దారుణమన్నారు. తప్పుడు కేసులు పెట్టించేందుకు వైఎస్ మనోహర్ రెడ్డి కొందరికి డబ్బులు ఇచ్చి పురమాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. లేనిపోని కేసులు పెట్టి తనను కూడా జైలుకు పంపించేందుకు పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆమె పేర్కొన్నారు. తమపై కేసు నమోదు చేసిన రోజే తమపై దాడికి వచ్చారని షబానా ఆరోపించారు. ఆ తర్వాత తమ ఇంటికి భద్రత కల్పించారన్నారు. తన ఇంటికి అంటించిన నోటీసులో.. స్టేషన్‌కు విచారణకు రావాలని మాత్రమే ప్రస్తావించారన్నారు. అసలు ఆ కేసు ఏంటి, వివరాలు తెలియజేయలేదని.. నోటీసులో కూడా లేవన్నారు. పులివెందుల పోలీస్ స్టేషన్‌లో తనపై, తన భర్తపై అన్యాయంగా కేసు నమోదు చేయించారన్నారు. ఈ కేసులో ఎప్పుడూ తమను విచారణకు రమ్మని చెప్పలేదు. తమపై కేసు పెట్టిన వారిని ఊరి నుంచి పంపించారన్నారు.