ఓ ఉద్యోగి లేదా కార్మికుడు రిటైర్ అయిన తర్వాత అతనికి పీఎఫ్ డబ్బు,పెన్షన్ వస్తుంది. దురదృష్టవశాత్తు ఉద్యోగి మరణిస్తే EPF ఖాతాలోని డబ్బు అతని కుటుంబానికి భద్రత కల్పిస్తుంది.EPF అకౌంట్‌లో నామినీగా ఉన్న వ్యక్తి ఆ డబ్బు తీసుకుంటారు. అయితే ఉద్యోగం చేస్తున్న సమయంలో కూడా ప్రావిడెంట్ ఫండ్ (PF) నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. మీ EPF అకౌంట్‌లో ఉన్న డబ్బును పూర్తిగా వెనక్కు తీసుకోవచ్చు.. లేదా కొంత మొత్తాన్ని మాత్రమే వెనక్కు తీసుకోవచ్చు. ఉద్యోగి ఉన్న పరిస్థితులకు లోబడి పూర్తిగా లేదా పాక్షికంగా డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.
ఉద్యోగంలో కొనసాగుతూనే అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ అకౌంట్ నుంచి కొంత డబ్బును విత్‌డ్రా చేయాలనుకుంటే., కేవలం కొన్ని పరిస్థితులలో మాత్రమే దీనికి అనుమతి లభిస్తుంది. అవి ఏంటంటే 1. చదువు కోసం, 2. మెడికల్ ట్రీట్మెంట్ కోసం, 3. వివాహం కోసం, 4. భూమి కొనడానికి లేదా ఇల్లు కొనడానికి/కట్టుకోవడానికి, 5. హోమ్ లోన్ కట్టడానికి, 6. ఇంటిని రీమోడల్ చేయడానికి.
EPF కడుతున్న వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోయి ఒక నెలకు పైగా ఉద్యోగం లేకుండా ఉంటే అప్పటి వరకు జమ చేసిన మొత్తంలో 75% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. రెండు నెలలు పైగా నిరుద్యోగిగా ఉంటే మిగతా 25% కూడా వెనక్కు తీసుకోవచ్చు. ఇవే కాదు, ఉద్యోగ విరమణకు ముందు పీఎఫ్ కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి కూడా అనుమతి లభిస్తుంది.
PF విత్‌డ్రాకి ఏం అవసరం?
1. UAN (Universal Account Number)
2. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్
3. ఆధార్ నంబర్ ( UANతో లింక్ అయి ఉండాలి)
4. ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్
5. విత్‌డ్రా సంబంధిత ప్రూఫ్ డాక్యుమెంట్స్
PF డబ్బును విత్‌డ్రా చేయడం ఎలా
-EPFO e-SEWA పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి
-ఆన్‌లైన్ క్లెయిమ్స్ సెక్షన్‌లోకి వెళ్లాలి
-బ్యాంక్ అకౌంట్ వివరాలను నమోదు చేయాలి
-టర్మ్స్&కండిషన్స్ బాక్స్‌లో టిక్ చేయండి
- డబ్బు విత్‌డ్రా చేస్తున్న కారణాన్ని ఎంచుకోండి
-అక్కడ అడిగిన వివరాలు ఎంటర్ చేసి, తగిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి
-మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి సబ్మిట్ నొక్కండి.
కేవలం 2 నిమిషాల్లోనే ఈ సని పూర్తవుతుంది. EPFO అధికార్లు మీ అప్లికేషన్‌ను ప్రాసెస్ చేసి, మీ బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బు జమ చేస్తారు.