తిరుపతి జిల్లాలోని గూడూరు రైల్వే స్టేషన్లో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. వందే భారత్ రైలు కింద పడి 60 ఏళ్ల మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు గూడూరులో స్టాపింగ్ లేదు. ఈ క్రమంలో అదే రైలు కింద పడి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. హతురాలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం సంభవించిందా.. లేక పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడిందా? అన్నది తెలియరాలేదు. వందే భారత్ ఎక్స్ప్రెస్ కిందపడి మహిళ మృతి చెందిన విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఆమె ఎవరా? అని ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్మార్టం కోసం గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.