ఉత్తర భారతంలో చలి పులి భయపెడుతోంది. ఉదయం అయినా దట్టమైన పొగమంచు వీడటం లేదు. ఈ క్రమంలోనే రోడ్లపై ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇవాళ ఉదయం కొన్ని వాహనాలు ఢీకొన్నాయి. అయితే ఈ వాహనాల్లో ఓ కోళ్ల వ్యాన్ కూడా ఉంది. అయితే ఓ వైపు ప్రమాదం జరిగి.. ఆ వాహనదారులు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండగా.. మరోవైపు.. స్థానికులు చేతివాటం ప్రదర్శించారు. వ్యాన్ నుంచి కోళ్లను ఎత్తుకెళ్లిపోయారు. వ్యాన్ డోర్లను పగలగొట్టి మరీ స్థానిక ప్రజలు కోళ్లను ఎత్తుకెళ్లడం తీవ్ర సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోను అక్కడే ఉన్న ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం ఉదయం పలు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. అయితే ఆ వాహనాల్లో కోళ్ల లోడ్‌తో వెళ్తున్న ఓ ట్రక్కు కూడా ఉంది. అయితే అది గమనించిన వాహనదారులు, స్థానికులు ఆ ట్రక్కులో ఉన్న కోళ్లను తాళాలు పగలగొట్టి మరీ ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. ఇక కొందరు అయితే ఒకేసారి నాలుగైదు కోళ్లను చేతిలో పట్టుకుని పారిపోయారు. మరికొందరు ఏకంగా సంచుల్లో వేసుకుని అక్కడి నుంచి జారుకున్నారు. అయితే అక్కడే ఉన్న ఆ ట్రక్కు డ్రైవర్.. తన వాహనం నుంచి కోళ్లు ఎత్తుకెళ్లొద్దని వారికి విజ్ఞప్తి చేసినా.. ఎవరూ వినలేదు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఆగ్రా నుంచి కాస్గంజ్‌కు వెళ్తున్న ఓ కోళ్ల ట్రక్కు ఢిల్లీ సమీపంలోని జర్నా నాలా వద్ద దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో కోళ్లను తరలించే ట్రక్కు ఉంది. దాని డ్రైవర్ సునీల్ కుమార్ గాయపడగా.. తనను కాపాడాలని కేకలు వేశాడు. అయితే అది పట్టించుకోని స్థానికులు ఆ ట్రక్కులో ఉన్న కోళ్లను వాహనదారులు, స్థానికులు ఎగబడి మరీ ఎత్తుకెళ్లారు. అయితే రూ.2.5 లక్షల విలువ చేసే కోళ్లు ఉన్నాయని డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. ఈ ఘటనతో తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని డ్రైవర్ వాపోయాడు. ఈ ఘటనతో సమీపంలో ఉన్న జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa