ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య.. రామమందిరానికి లక్షల్లో విరాళం అందజేసిన యాచకులు

national |  Suryaa Desk  | Published : Wed, Dec 27, 2023, 08:18 PM

కోట్లాది మంది హిందువుల దశాబ్దాల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని భవ్యమైన రామమందిర నిర్మాణం పూర్తికాగా.. వచ్చే నెల 22న ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ నేపథ్యంలో రామభక్తులు తమకు తోచినంత మేర ఆలయానికి విరాళంగా ఇస్తున్నారు. తాజాగా, యాచకులు విరాళం సమర్పించి రాముడిపై తమ అచంచల భక్తిని చాటుకున్నారు. కాశీలో జీవనం సాగిస్తున్న బిచ్చగాళ్లు అయోధ్య రామాలయానికి రూ.4.5 లక్షలు విరాళంగా ఇచ్చారు. సాధారణంగా ఇతరుల ముందు చేయిచాచి అర్ధించే వీరు ఆలయానికి తమవంతుగా కొంత మొత్తాన్ని అందజేశారు.


కాశీకి చెందిన యాచకుల సంఘం రామాలయానికి రూ.4.5 లక్షలు విరాళంగా సమర్పించింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌) సమర్పణ్ నిధి ప్రచారంలో 300 మందికి పైగా యాచకులు పాల్గొన్నారు. వారణాసిలో భిక్షాటన చేస్తున్న కొందరు.. 2020 నవంబరులో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి చేరుకుని ఈ ప్రచారంలో తమను కూడా భాగస్వాములను చేయాలని కోరారు. వారి కోరికను మన్నించి, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. దీంతో ఉత్తర్ ప్రదేశ్‌లోని 27 జిల్లాలకు చెందిన యాచకులు రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు అందించారు.


ఈ సందర్భంగా కాశీలో భిక్షాటన చేసే బైద్యనాథ్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ.. 30 ఏళ్ల కింద అనారోగ్యానికి గురైన తనకు ఏ పనిచేయడానికి శరీరం సహకరించని స్థితికి చేరుకున్నాని చెప్పారు. అప్పటి నుంచి భిక్షాటనతో జీవనం సాగిస్తున్నానని తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం నిధుల సేకరణ జరుగుతుందని తెలుసుకుని యాచకులమంతా విరాళాలు సేకరించాలని నిర్ణయించుకున్నామని వివరించారు. జనవరి 22న అయోధ్యలో జరిగే ఆలయ ప్రారంభోత్సవానికి తాను వెళ్లాలనుకుంటున్నానని అన్నాడు.


కాశీ పరిధిలో ఉంటున్న 300 మందికి పైగా యాచకులు రామాలయానికి విరాళాలు అందించారు. అలాగే, 4వేల మందికిపైగా చెప్పులు కుట్టేవారు, రజకులు, స్వీపర్లు కూడా తమ కష్టార్జితంలోని కొంత భాగాన్ని రామాలయం కోసం విరాళంగా సమర్పించారు. మరోవైపు, మహా ప్రాణ ప్రతిష్ఠ రోజున దేశంలోని ప్రతి ఆలయం, హిందువు ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని కోరారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa