రోజులు మారాయి.. జనాల అవసరాలకు తగినట్లుగా అన్నీ ఈజీగా అందుబాటులోకి వస్తున్నాయి. రోడ్ల పక్కన మొబైల్ టిఫిన్ సెంటర్లు, ఆటోల్లో కూరగాయలు, పండ్లు జనాలకు అవసరమైన వస్తువుల్ని అమ్మేస్తున్నారు.. ఏది కావాలన్నా ఇంటి దగ్గరకు వచ్చేస్తోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. మొన్నటి వరకు టిఫిన్లు, కూరగాయలతో పాటూ ఇతర నిత్యవసర వస్తువల కోసం వాహనాలను ఏర్పాటు చేసుకుంటే.. అనంతపురం జిల్లాలో మాత్రం పేకాటరాయుళ్లు తెలివి మీరిపోయారు. పేకాటపై పోలీసుల నిఘా పెరగడంతో అతి తెలివితో ఆలోచించారు. బొలేరో వాహనాన్ని మొబైల్ పేకాట డెన్‌గా మార్చేశారు. పేకాటరాయుళ్లను ఆ వాహనంలోకి ఎక్కించుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఈ సెటప్ చేశాడు. బొలెరో వాహనం లోపల ఉన్నవాళ్లు ఎవరికీ కనిపించకుండా.. చుట్టూ పట్టల్ని కట్టేశాడు. కానీ అనుకోకుండా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. జల్లిపల్లి టోల్ గేట్ దగ్గర తనిఖీల చేస్తుండగా.. ఈ వ్యవహారం మొత్తం బయటపడింది.
జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం బొమ్మలాటపల్లికి చెందిన రమణ.. తన సొంత బొలేరో వాహనాన్ని గ్యాంబ్లింగ్‌కు అడ్డాగా మార్చేశాడు. పేకాటరాయుళ్లను వాహనంలోకి ఎక్కించుకుని తిప్పుతుండగా.. వారు ఎంచక్కా లోపల పేకాట ఆడుతున్నారు. బొలేరో వాహనాన్ని ఊరంతా తిప్పుంటే.. లోపల పేకాటరాయుళ్లు చక్కగా ఆడుకునేవాళ్లు. చాలా రోజులుగా ఈ దందా కొనసాగుతోంది. ఇంతలో పోలీసులు జల్లిపల్లి టోల్ గేట్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్నారు. బొలేరో వాహనంపై ఎందుకో వారికి అనుమానం వచ్చింది.. వెంటనే వాహనంలో తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఆ వాహనంలో 16 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాటరాయుళ్ల నుంచి డబ్బులు.. మొబైల్స్ సీజ్ చేశారు. మొబైల్ గ్యాంబ్లింగ్ వెనుక ప్రధాన సూత్రదారి బొలేరో వాహనం యజమాని రమణ అని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి స్థానికులు ఒకింత అవాక్కయ్యారు.. ఏం ఐడియా గురూ అంటూ సరదాగా నవ్వుకుంటున్నారు.