రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణాల్లో భారీ అవినీతి చోటుచేసుకుందని, దీనిపై వెంటనే సీబీఐతో విచారణ చేయించాలని ప్రధాని నరేంద్ర మోదీకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. శనివారం ఉదయం ఈ లేఖను ప్రధాని మోదీకి పంపించారు. పేదలకు సొంతిల్లు పేరిట కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.35,141 కోట్ల నిధులను వెచ్చించిందని, ఇందులో భారీగా నిధులు పక్కదారి పట్టాయని లేఖలో పేర్కొన్నారు. ‘వైసీపీ ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం పేరుతో 30లక్షల గృహాలు నిర్మిస్తామని చెప్పింది. 29 లక్షల మంది మహిళల పేరుతో పట్టాలిచ్చేందుకు నిర్ణయించినా, 21 లక్షల మందినే లబ్ధిదారులగా గుర్తించింది. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం రూ.1,75,421 కోట్లు కాగా, ఈ ఐదేళ్లలో ప్రభుత్వం గృహనిర్మాణాలకు బడ్జెట్‌లో రూ.23,106 కోట్లే కేటాయించింది. అందులోనూ రూ.11,358 కోట్లే ఖర్చు చేసింది. కానీ.. రూ.91,503 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతోంది. ఇందులో అనేక సందేహాలున్నాయి’ అని పేర్కొన్నారు. ‘మొదట చెప్పినట్లుగా 30లక్షల గృహాలను నిర్మించకుండా 17,005 జగనన్న లేఅవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చారు. ఈ మొత్తం పథకంలో ప్రజాధనాన్ని భారీగా పక్కదారి పట్టించింది. పథకం పేరిట వైసీపీ నాయకులు భారీగా లాభపడ్డారు. ప్రధానంగా.. పీఎంఏవై, జేజేఎం, ఎంజీఎన్‌ఆర్‌ఈజీపీ, ఎస్సీఎం తదితర కేంద్ర పథకాల నిధులను ఇష్టానుసారం కలిపేసి ఆ నిధులను వైసీపీ పథకానికి వాడుకున్నారు’ అని ఆరోపించారు.