వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల వెంటే ఉంటానని.. ఆమెతో ఇప్పటికే చర్చించానని.. ఆమె భవిష్యత్‌లో ఏ పార్టీలో చేరితే తానూ అదే పార్టీలో చేరి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల తన శాసనసభ్యత్వానికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆయన.. శనివారమిక్కడ మంగళగిరి ఆటోనగర్‌లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టి.. అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు. ఏ ప్రభుత్వానికైనా సంక్షేమం, అభివృద్ధి రెండూ రెండు కళ్లు వంటివని.. ఒంటికన్నుతో రాణించాలనుకోవడం ఆత్మహత్యాసదృశమన్నారు. ‘మంగళగిరికి దూరంగా ఉండలేను. విలువలకు లోబడి జీవిస్తా. ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ పంపించా. ఆమోదంతో నాకు పనిలేదు. నా గన్‌మెన్‌ను సరెండర్ చేశా. సాధారణ పౌరుడిగానే ఉంటా అని తెలిపారు.